Empagliflozin:డయాబెటిస్ పెషెంట్లకు దేశీయ ఫార్మా సంస్థలు గుడ్ న్యూస్.. ఇకపై తక్కువ ధరకే ఎంపాగ్లిఫ్లోజిన్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని డయాబెటిస్ రోగులకు శుభవార్త! ప్రాణాంతక డయాబెటిస్‌ను సమర్థంగా ఎదుర్కొనే ఎంపాగ్లిఫ్లోజిన్ ఔషధం త్వరలో సామాన్యులకు అందుబాటులోకి రానుంది.
అంతర్జాతీయ స్థాయిలో ఈ ఔషధంపై పేటెంట్ గడువు ముగియడంతో, దేశీయ ఔషధ కంపెనీలు ఈ మందును తక్కువ ధరకు ఉత్పత్తి చేసి విక్రయించేందుకు సిద్ధమయ్యాయి.
దీని ద్వారా డయాబెటిస్ చికిత్సకు అయ్యే ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి.
ప్రముఖ బహుళజాతి కంపెనీ బోహ్రింగర్ ఇంగెల్‌హైమ్‌కు చెందిన ఎంపాగ్లిఫ్లోజిన్ పేటెంట్ ఈ ఏడాది మార్చి 11న ముగియనుంది.
దీని ఫలితంగా మ్యాన్‌కైండ్ ఫార్మా,టొరెంట్,ఆల్కెమ్,డాక్టర్ రెడ్డీస్,లుపిన్ వంటి ప్రముఖ భారతీయ ఔషధ సంస్థలు జెనరిక్ ఎంపాగ్లిఫ్లోజిన్‌ను విడుదల చేయడానికి పోటీ పడుతున్నాయి.
వివరాలు
ఎంపాగ్లిఫ్లోజిన్ టాబ్లెట్‌ను కేవలం రూ. 6కే..
దేశంలోని నాల్గవ అతిపెద్ద ఫార్మా కంపెనీ అయిన మ్యాన్‌కైండ్ ఫార్మా సంచలన ప్రకటన చేసింది.
ప్రస్తుతం రూ. 60 ధర ఉన్న ఒక్కో ఎంపాగ్లిఫ్లోజిన్ టాబ్లెట్‌ను కేవలం రూ. 6కే అందించనున్నట్లు వెల్లడించింది.
మిగిలిన ఇతర జెనరిక్ కంపెనీలు కూడా రూ. 9 నుండి రూ. 14 మధ్య ధరల్లో ఈ మందును విక్రయించే అవకాశముంది.
ఈ తక్కువ ధరల కారణంగా దాదాపు రూ. 20,000 కోట్ల విలువైన డయాబెటిస్ ఔషధ మార్కెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
గతేడాది ఈ మార్కెట్ 43% వృద్ధితో రూ. 14,000 కోట్ల నుంచి రూ. 20,000 కోట్లకు చేరుకుంది.
వివరాలు
అధిక ధర కారణంగా అందుబాటులో లేని.. ఎంపాగ్లిఫ్లోజిన్
ఈ సందర్భంగా మ్యాన్‌కైండ్ ఫార్మా ప్రతినిధి మాట్లాడుతూ, "అమెరికా వంటి కఠిన నిబంధనలున్న దేశాల్లో ధృవీకరించబడిన ముడి పదార్థాలతో నాణ్యమైన మందులను తక్కువ ధరకే అందించాలన్నదే మా లక్ష్యం. సొంతంగా API ఉత్పత్తి చేసుకోవడం ద్వారా ఖర్చులను తగ్గించగలుగుతున్నాం. మార్కెట్ విస్తరణ కోసం రెండు వేర్వేరు బ్రాండ్ల ద్వారా విక్రయాలు జరుపుతాం" అని తెలిపారు.
ఎంపాగ్లిఫ్లోజిన్ మందు డయాబెటిస్‌తో పాటు గుండె సంబంధిత సమస్యలు,మూత్రపిండాల వ్యాధులను కూడా సమర్థంగా నివారించగలదు.
అయితే అధిక ధర కారణంగా ఇప్పటివరకు ఈ మందు అందరికీ అందుబాటులో లేకుండా పోయింది.
వివరాలు
డయాబెటిస్ రోగుల సంఖ్య 10 కోట్లు
ఇప్పుడు జెనరిక్ రూపంలో తక్కువ ధరకే లభించడంతో కోట్లాది మంది డయాబెటిస్ రోగులకు ఊరట లభించనుంది.
ముఖ్యంగా భారతదేశం వంటి దేశాల్లో డయాబెటిస్ రోగుల సంఖ్య 10 కోట్లకు పైగా ఉన్న నేపథ్యంలో, ఈ పరిణామం ఎంతో కీలకంగా మారనుంది.
ప్రస్తుతం టైప్-2 డయాబెటిస్ చికిత్సలో మొదటి ఎంపికగా మెట్‌ఫార్మిన్ మందు ఉపయోగించబడుతోంది.
అయితే, వ్యాధి తీవ్రతను బట్టి వైద్యులు సల్ఫోనిలురియాస్, DPP-4 ఇన్హిబిటర్స్, SGLT2 ఇన్హిబిటర్స్ వంటి ఇతర మందులను సూచిస్తున్నారు.
తాజాగా, సెమాగ్లుటైడ్, టిర్జెపాటైడ్ వంటి అధునాతన ఔషధాలు కూడా అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఎంపాగ్లిఫ్లోజిన్ వంటి తక్కువ ధరల జెనరిక్ మందులు పేద, మధ్య తరగతి ప్రజలకు గొప్ప వరంగా మారనున్నాయి.
వివరాలు
ఆర్థిక భారం తగ్గించి, మెరుగైన వైద్యసేవలు
మన దేశంలో పరిమిత వైద్య బీమా సౌకర్యాల కారణంగా, ఎక్కువ మంది సొంత డబ్బుతో వైద్యం చేయించుకుంటున్నారు.
అలాంటి పరిస్థితిలో, ఈ చౌక ధరల ఔషధాలు వారి ఆర్థిక భారం తగ్గించి, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు దోహదపడనున్నాయి.