
Trump's 100% tariffs: భారత ఫార్మా రంగంపై 'టారీఫ్' పిడుగు.. ఎగుమతులపై ప్రభావం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించిన కొత్త నిర్ణయం భారత ఫార్మా పరిశ్రమకు పెద్ద షాక్ ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపై ఏకంగా 100 శాతం దిగుమతి టారిఫ్ లు విధిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, అమెరికాలో ప్లాంట్‌లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు ఈ టారిఫ్ లు వర్తించవని పేర్కొన్నారు. "నిర్మాణం మొదలయిందని" లేదా "కన్స్ట్రక్షన్ జరుగుతోంది" అని నిర్ధారణ అయ్యే కంపెనీలకు మాత్రమే ఈ టారిఫ్ వర్తించదు. ట్రంప్ ఈ ప్రకటనను "ట్రూత్ సోషియల్" ద్వారా చేశారు, కానీ ఈ టారిఫ్ ఎలా అమలు చేస్తారన్న విషయంలో ఎటువంటి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
వివరాలు
FY25లో భారత ఫార్మా రంగం 30 బిలియన్ డాలర్ల ఎగుమతులను సాధించింది
భారత్ నుంచి అమెరికాకు ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు పెద్ద మొత్తంలో ఉన్నాయి. Pharmexcil సమాచారం ప్రకారం, FY25లో భారత్ నుంచి అమెరికాకు ఫార్మా ఎగుమతులు 10.5 బిలియన్ డాలర్లకు చేరగా, ఇది ఒక సంవత్సరం కంటే 20.43% పెరుగుదల. మొత్తం భారత ఫార్మా ఎగుమతుల్లో అమెరికా వాటా 34.51% ఉంటుంది. FY25లో భారత ఫార్మా రంగం 30 బిలియన్ డాలర్ల ఎగుమతులను సాధించింది.
వివరాలు
4శాతం పడిపోయిన ఫార్మా షేర్లు
ఈ టారిఫ్ నిర్ణయం ప్రధానంగా బ్రాండెడ్ ఫార్మా ఉత్పత్తులపై వర్తించనప్పటికీ,దీని ప్రభావం ఎక్కువే. డాక్టర్ రెడ్డి'స్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్సైన్స్,సన్ ఫార్మా, సిప్లా,గ్లాండ్ ఫార్మా వంటి కంపెనీలకు అమెరికా మార్కెట్ నుండి 30-50% ఆదాయం వస్తుంది. ఈ టారిఫ్‌ల ప్రకటనతో ట్రేడింగ్ ప్రారంభంలో ఫార్మా షేర్లు 4శాతం పడిపోయాయి.నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2.42% పడిపోవడంతో 21,445.50 వద్దకి చేరింది. సన్ ఫార్మా 4.87% క్షీణించి ₹1,548 కు, గ్లాండ్ ఫార్మా 4.70% తగ్గి ₹1,880 కు చేరింది.లారస్ ల్యాబ్స్,ఐపికా ల్యాబ్స్, డివిస్, జైడస్ లైఫ్, అల్కెం ల్యాబ్స్, సిప్లా,అజంతా ఫార్మా, డాక్టర్ రెడ్డి'స్, టారెంట్ ఫార్మా, అబొట్ ఇండియా, గ్లెన్ మార్క్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీల షేర్లకూ నష్టాలు సంభవించాయి.