Anil Ambani: మనీలాండరింగ్ కేసు.. అనిల్ అంబానీ రూ.3,000 కోట్లకు పైగా ఆస్తులు అటాచ్
ఈ వార్తాకథనం ఏంటి
మనీలాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా ఆయనకు చెందిన రూ.3వేల కోట్లకు పైగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. అటాచ్ చేసిన ఆస్తుల్లో అనిల్ అంబానీ వ్యక్తిగత నివాసం సహా పలు వాణిజ్య ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. వివరాల ప్రకారం,ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న అనిల్ అంబానీ నివాసం,అలాగే ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్‌కు సంబంధించిన కొంత భూమిని ఈడీ అటాచ్ చేసినట్లు తెలిసింది. అదనంగా ఢిల్లీ,నోయిడా,గాజియాబాద్,ముంబయి,పుణె, ఠాణె, హైదరాబాద్, చెన్నై, తూర్పు గోదావరి జిల్లాల్లో అనిల్ అంబానీ కంపెనీలకు చెందిన నివాస, వాణిజ్య ఆస్తులు కూడా ఈ జాబితాలో ఉన్నాయని వెల్లడించారు.
వివరాలు
రూ.17,000కోట్లకు పైగా నిధులను అక్రమంగా బదిలీ
వీటి మొత్తం విలువ రూ.3,084 కోట్లు అని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు భారీ స్థాయిలో బ్యాంకు రుణాల మోసానికి పాల్పడ్డాయనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఆ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ ఇన్‌ఫ్రా సహా అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని పలు కంపెనీలు రూ.17,000కోట్లకు పైగా నిధులను అక్రమంగా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో,ఈఏడాది జూలై నెలలో ఈడీ రిలయన్స్ గ్రూప్‌లోని 50కంపెనీలకు చెందిన 35చోట్ల సోదాలు జరిపింది. అలాగే,25మంది కీలక వ్యక్తులను విచారించింది.అనంతరం ఆగస్టులో అనిల్ అంబానీతో పాటు కంపెనీకి చెందిన పలు సీనియర్ అధికారులను కూడా విచారణకు హాజరుచేసినట్లు సమాచారం.