Anil Ambani: అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపై ఈడీ రైడ్స్.. ముంబయి, హైదరాబాద్‌లో సోదాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయనకు చెందిన అనిల్ అంబానీ గ్రూప్ (ADAG)లో భాగమైన రిలయన్స్ పవర్ సంస్థకు సంబంధించిన ముంబయి,హైదరాబాద్ నగరాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు జాతీయ మీడియా నివేదికలు తెలిపాయి. ఈ దాడుల్లో సుమారు 15 బృందాలు పాల్గొన్నాయని సమాచారం.
వివరాలు
రూ.40 వేల కోట్లకు పైగా రుణ మోసాల మొత్తం
ఇదిలా ఉండగా, మనీలాండరింగ్ కేసు దర్యాప్తు భాగంగా ఫిబ్రవరి 27న అనిల్ అంబానీ ఈడీ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన హాజరు కాకపోవడంతో అధికారులు తదుపరి చర్యగా సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణ మోసానికి పాల్పడ్డాయన్న ఆరోపణలతో ఆయనపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ రుణ మోసాల మొత్తం విలువ సుమారు రూ.40 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.