Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా జెఫ్ బెజోస్.. రెండోస్థానానికి మస్క్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మళ్లీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న ఎలాన్ మస్క్‌ను జెఫ్ బెజోస్ అధిగమించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం బెజోస్ ప్రస్తుత నికర విలువ 200బిలియన్ డాలర్లు కాగా.. మస్క్ సంపద 198బిలియన్ డాలర్లు. సోమవారం టెస్లా షేర్లలో 7.2శాతం క్షీణత నమోదు కావడంతో.. తొమ్మిది నెలల్లో మొదటిసారిగా మస్క్ తన స్థానాన్ని కోల్పోయాడు. గత సంవత్సరం టెస్లా సీఈఓ మస్క్ సుమారు 31బిలియన్ యుఎస్ డాలర్ల నష్టాన్ని చవిచూడగా.. అమెజాన్ వ్యవస్థాపకుడు 23 బిలియన్ డాలర్లు లాభపడ్డారు. జనవరి 2021లో మస్క్ 195 బిలియన్ డాలర్ల నికర విలువతో బెజోస్‌ను అధిగమించి తొలిసారి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
11వ స్థానంలో ముకేష్ అంబానీ
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆర్నాల్ట్ ఇప్పుడు 197 బిలియన్ డాలర్ల నికర విలువతో మూడో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (179 బిలియన్ డాలర్లు), మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (150 బిలియన్ డాలర్ల) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వరుసగా 11, 12 స్థానాల్లో ఉన్నారు. అంబానీ మొత్తం సంపద 115 బిలియన్ డాలర్లు కాగా, అదానీది 104 బిలియన్ డాలర్లుగా బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. 2021 తర్వాత బ్లూమ్‌బెర్గ్ ర్యాంకింగ్స్‌లో బెజోస్ తిరిగి అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.