LOADING...
Elon Musk: ట్రిలియనీర్ హోదా కోల్పోయిన మస్క్.. 10 రోజుల్లోనే  రూ. 47 లక్షల కోట్ల సంపద ఆవిరి!
10 రోజుల్లోనే  రూ. 47 లక్షల కోట్ల సంపద ఆవిరి!

Elon Musk: ట్రిలియనీర్ హోదా కోల్పోయిన మస్క్.. 10 రోజుల్లోనే  రూ. 47 లక్షల కోట్ల సంపద ఆవిరి!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 24, 2026
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజుల క్రితం స్పేస్‌-X ఐపీఓ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రికార్డు స్థాయిలో 85 బిలియన్ డాలర్లకు పైగా నిధులు సమీకరించిన ఈ ఇష్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచింది. ఇష్యూ ధరను 135 డాలర్లుగా నిర్ణయించగా,జూన్ 12న షేర్ 12 శాతం ప్రీమియంతో 150 డాలర్లకు పైగా లిస్టయ్యింది. తొలి రోజే 160 డాలర్ల స్థాయిని కూడా తాకింది. స్పేస్‌ఎక్స్‌లో ఎలాన్ మస్క్‌కు అత్యధిక వాటా ఉండటంతో కంపెనీ లిస్టింగ్ అనంతరం ఆయన వాటా విలువ భారీగా పెరిగింది. దీంతో మస్క్ మొత్తం సంపద ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది.

వివరాలు 

రూ. 137 లక్షల కోట్లకు చేరిన సంపద

అంటే లక్ష కోట్ల డాలర్లకు పైగా సంపదను సొంతం చేసుకుని ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా నిలిచారు. ఒక ట్రిలియన్ డాలర్ల విలువ భారత కరెన్సీలో సుమారు రూ. 95 లక్షల కోట్లకు సమానం. అయితే స్పేస్‌ఎక్స్ లిస్టింగ్ అనంతరం మస్క్ సంపద రూ. 100 లక్షల కోట్లను కూడా దాటింది. ఇదే సమయంలో స్పేస్‌ఎక్స్ షేర్ ధర మరింతగా దూసుకెళ్లి ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు 70 శాతం పెరిగి 225.64 డాలర్ల గరిష్ఠ స్థాయిని చేరుకుంది. దీంతో మస్క్ సంపద సుమారు 1.45 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనాలు వెలువడ్డాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ. 137 లక్షల కోట్లకు సమానం.

వివరాలు 

షేర్ల పతనంతో మారిన పరిస్థితి

అయితే ఈ ఉత్సాహం ఎక్కువకాలం కొనసాగలేదు. కృత్రిమ మేధస్సు (AI) రంగంలో లక్ష్యాలను సాధించేందుకు ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ బాండ్లను విక్రయించనున్నట్లు మస్క్ ప్రకటించడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో స్పేస్‌ఎక్స్ షేర్ ధర వరుస సెషన్లలో భారీగా క్షీణించింది. గరిష్ఠ స్థాయిలో ఉన్న షేర్ మళ్లీ 150 డాలర్ల పరిధికి పడిపోయి లిస్టింగ్ ధర దగ్గరికి చేరుకుంది. ఇదే సమయంలో జూన్ 23న టెస్లా షేర్ కూడా ఒకే రోజులో 6 శాతం వరకు క్షీణించింది. టెస్లాలో కూడా మస్క్‌కు భారీ వాటా ఉండటంతో ఆయన సంపదపై ప్రత్యక్ష ప్రభావం పడింది.

Advertisement

వివరాలు 

ఒక్కరోజులో రూ. 11 లక్షల కోట్ల నష్టం

స్పేస్‌ఎక్స్, టెస్లా షేర్ల పతన ప్రభావంతో ఎలాన్ మస్క్ సంపద ఒక్కరోజులోనే 118 బిలియన్ డాలర్లు తగ్గినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ. 11 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. దీంతో ప్రస్తుతం మస్క్ నికర సంపద 957 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే సుమారు రూ. 90 లక్షల కోట్ల స్థాయికి చేరింది. దీంతో కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఆయన ట్రిలియనీర్ హోదాను కోల్పోయారు.

Advertisement

వివరాలు 

10 రోజుల్లో రూ.47 లక్షల కోట్ల సంపద ఆవిరి

గరిష్ఠ స్థాయిలో ఉన్న సంపదతో పోలిస్తే ఎలాన్ మస్క్ సంపదలో దాదాపు రూ. 47 లక్షల కోట్ల మేర తగ్గుదల నమోదైంది. స్పేస్‌ ఎక్స్ మార్కెట్ విలువ కూడా ఇదే సమయంలో గణనీయంగా పడిపోతోంది. అయినప్పటికీ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ తన స్థానాన్ని కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో స్పేస్‌ఎక్స్, టెస్లా షేర్లు తిరిగి పుంజుకుంటే మస్క్ మళ్లీ ట్రిలియనీర్ హోదాను దక్కించుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement