Loading...
Elon Musk: భారత ఏఐ కలలకు కరెంట్ కష్టాలు.. ఎలాన్ మస్క్ హెచ్చరికతో పెరిగిన చర్చ
భారత ఏఐ కలలకు కరెంట్ కష్టాలు.. ఎలాన్ మస్క్ హెచ్చరికతో పెరిగిన చర్చ

Elon Musk: భారత ఏఐ కలలకు కరెంట్ కష్టాలు.. ఎలాన్ మస్క్ హెచ్చరికతో పెరిగిన చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా 'ది ఎకనామిస్ట్' పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. భారత్, అమెరికా, యూరప్ దేశాలు కలిసి ఉత్పత్తి చేసే విద్యుత్ కంటే చైనా ఒక్కటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని మస్క్ పేర్కొన్నారు. దీంతో భారీ ఏఐ లక్ష్యాలతో ముందుకెళ్తున్న భారత్‌కు విద్యుత్ కొరత ప్రధాన సవాలుగా మారుతుందా? చైనాతో పోలిస్తే ఏఐ రేసులో భారత్ వెనుకబడుతుందా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

వివరాలు 

డేటా వినియోగంలో ముందంజ.. సెంటర్లలో మాత్రం వెనుకంజ

ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న మొత్తం డేటాలో దాదాపు 20 శాతం భారత్ నుంచే వస్తోంది.

అయితే ప్రపంచంలోని మొత్తం డేటా సెంటర్లలో భారత్ వాటా మాత్రం కేవలం 5 శాతమే.

డేటా వినియోగం, డేటా సెంటర్ల సామర్థ్యం మధ్య ఉన్న ఈ అంతరాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం.. 2030 నాటికి భారత్‌లోని డేటా సెంటర్ల విద్యుత్ అవసరం 16 గిగావాట్లకు చేరుకునే అవకాశం ఉంది.

ఇదే సమయంలో 2030 నాటికి దేశంలో కనీసం 10 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లక్ష్యంగా నిర్దేశించారు.

వివరాలు 

విద్యుత్ లేకపోతే ఏఐ ఎలా నడుస్తుంది?

ఇక్కడే భారత్‌కు అసలు సవాలు ఎదురుకానుంది.

డేటా సెంటర్లు సాధారణ కార్యాలయాల మాదిరిగా పగటి సమయంలో మాత్రమే పనిచేయవు.

అవి 24 గంటలూ నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏఐ సర్వర్లకు సాధారణ కంప్యూటర్లతో పోలిస్తే వందల రెట్లు అధికంగా విద్యుత్ అవసరమవుతుంది.

మరోవైపు దేశంలో సాధారణ విద్యుత్ వినియోగానికి డిమాండ్ కూడా ఏటా సుమారు 6.4 శాతం పెరుగుతోంది.

ప్రజల అవసరాలకు సరిపడా విద్యుత్‌ను అందించడంతో పాటు ఏఐ, డేటా సెంటర్లకు అవసరమైన భారీ విద్యుత్‌ను సమకూర్చడం భారత్‌కు కీలక సవాలుగా మారనుంది.

పెరుగుతున్న ఈ డిమాండ్‌ను తీర్చేందుకు అవసరమైన విద్యుత్‌ను ఎక్కడి నుంచి సమకూర్చాలన్నదే ప్రధాన ప్రశ్న.

ADVERTISEMENT

వివరాలు 

పర్యావరణంపైనా భారీ ప్రభావం

ఏఐ డేటా సెంటర్లకు విద్యుత్‌తో పాటు మరో కీలక వనరు కూడా భారీగా అవసరమవుతుంది.

అదే నీరు. డేటా సెంటర్లలోని సర్వర్లు నిరంతరం పనిచేయడం వల్ల భారీగా వేడి ఉత్పత్తి అవుతుంది.

ఈ ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు శీతలీకరణ వ్యవస్థలు అవసరం. ఇందుకోసం కొన్ని సందర్భాల్లో లక్షల లీటర్ల నీటిని వినియోగించాల్సి వస్తుంది.

ఇది పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని అక్రోని సంస్థకు చెందిన అలోనా గెక్లర్ పేర్కొన్నారు.

ఏఐ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు, కొత్త అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదని ఆమె అన్నారు.

అయితే ఏఐ అభివృద్ధి కోసం చెల్లించాల్సిన పర్యావరణ మూల్యం చాలా ఎక్కువగా ఉండకూడదని హెచ్చరించారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రత్యేక పర్యావరణ చట్టం లేదు

భవిష్యత్తులో ఏఐ ఎంత ఆర్థిక విలువను సృష్టిస్తుందన్నదానికంటే.. దాని అభివృద్ధి కారణంగా జరుగుతున్న పర్యావరణ నష్టాన్ని ఎంతవరకు తగ్గించగలమన్నదే కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు.

భారత్‌లో ఏఐ డేటా సెంటర్ల కోసం ప్రత్యేకంగా ఒకే పర్యావరణ చట్టం ప్రస్తుతం లేదు.

అయితే ప్రాజెక్టు పరిమాణం,ఏర్పాటు చేసే ప్రాంతాన్ని బట్టి కాలుష్య నియంత్రణ మండళ్ల అనుమతులు,భూగర్భ జలాల వినియోగానికి సంబంధించిన నిబంధనలు వర్తిస్తాయి.

నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో డేటా సెంటర్ల కోసం వాటర్ కూలింగ్ సిస్టమ్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.

ఇప్పటికే నీటి లభ్యత సమస్యగా ఉన్న ప్రాంతాల్లో భారీ స్థాయిలో నీటిని వినియోగించే డేటా సెంటర్ల ఏర్పాటుతో స్థానిక వనరులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

వివరాలు 

కఠిన నిబంధనలు అవసరం

రానున్న రోజుల్లో ఏఐ డేటా సెంటర్ల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం మరింత కఠినమైన పర్యావరణ నిబంధనలను తీసుకురావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏఐ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడంతో పాటు విద్యుత్, నీరు వంటి సహజ వనరులను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉంది.

భారత్‌లో ఏఐకు భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తున్నప్పటికీ.. విద్యుత్, నీరు, ఇతర వనరులపై పెరుగుతున్న ఒత్తిడిని దేశం ఎలా ఎదుర్కొంటుందన్నదే కీలకం.

పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే ఏఐ రంగాన్ని ముందుకు తీసుకెళ్లగలిగితేనే భారత్ తన ఏఐ లక్ష్యాలను విజయవంతంగా చేరుకోగలదు.

ADVERTISEMENT