
Elon Musk: 'ఎక్స్'ను అమ్మేసిన ఎలాన్ మస్క్.. కొత్త యజమాని ఎవరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్'ను విక్రయించినట్లు ప్రకటించారు.
మస్క్ నేతృత్వంలోని కృత్రిమ మేధ (AI) అంకుర సంస్థ 'ఎక్స్‌ఏఐ' (xAI)కే విక్రయించారు. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా 'ఎక్స్'లో పోస్టు చేశారు.
మొత్తం 33 బిలియన్ డాలర్లకు 'ఎక్స్'ను అమ్మినట్లు వెల్లడించారు. తాజా అంచనాల ప్రకారం, ఎక్స్‌ఏఐ మొత్తం విలువ 80 బిలియన్ డాలర్లుగా నిర్ధరించారు.
ఎక్స్‌ఏఐలోని అధునాతన ఏఐ సామర్థ్యాలను 'ఎక్స్'తో అనుసంధానం చేయడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించగలమని మస్క్ పేర్కొన్నారు.
Details
గతేడాది 'ఎక్స్‌ఏఐ' ప్రారంభం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సలహాదారుగా వ్యవహరిస్తున్న మస్క్ ప్రస్తుతం టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవోగా కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
2022లో 'ట్విటర్'ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మస్క్, ఆ తర్వాత దాని పేరును 'ఎక్స్'గా మార్చారు.
ఎక్స్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత సిబ్బంది తొలగింపు, ద్వేషపూరిత ప్రసంగాల పెరుగుదల వంటి అంశాలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
మస్క్ గతేడాది చాట్‌జీపీటీకి పోటీగా 'ఎక్స్‌ఏఐ' అనే అంకుర సంస్థను ప్రారంభించారు.
Details
కోట్లాదిమంది వినియోగదారులకు అత్యుత్తమ అనుభూతి
"ఎక్స్‌ఏఐ, ఎక్స్ భవిష్యత్‌లు పరస్పరంగా ముడిపడి ఉన్నాయి.
డేటా మోడల్స్‌ను అనుసంధానం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించగలమని మస్క్ తన పోస్టులో వెల్లడించారు.
ఎక్స్‌ఏఐ అధునాతన ఏఐ సామర్థ్యం 'ఎక్స్' సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని, ఈ రెండు సంస్థల కలయిక కోట్లాది మంది వినియోగదారులకు అత్యుత్తమ అనుభూతిని అందించగలదని మస్క్ పేర్కొన్నారు.