PF Interest Hike: వాటిని నమ్మొద్దు.. ఈపీఎఫ్ వడ్డీ 10 శాతం పెంపుపై కేంద్రం క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది వేతన ఉద్యోగుల కోసం అత్యంత ముఖ్యమైన సామాజిక భద్రతా పథకాలలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఒకటి. ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక భద్రతను అందించే ఈ పథకానికి సంబంధించిన వడ్డీ రేటు విషయంపై ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పీఎఫ్ వడ్డీని 10 శాతానికి పెంచుతారనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఈపీఎఫ్ఓ (EPFO) వడ్డీ రేటును ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఈ వడ్డీ సుమారు 8.25 శాతం వద్ద కొనసాగుతోంది.
వివరాలు
క్లారిటీ ఇచ్చిన మంత్రి..
అయితే పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేటును పెంచాలని ఉద్యోగులు చాలాకాలంగా కోరుతున్నారు. ఈ సందర్భంలో లోక్‌సభ సభ్యుడు విజయ్ కుమార్ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తారు. పీఎఫ్ వడ్డీని 10 శాతానికి పెంచే యోచన ప్రభుత్వానికి ఉందా? ఈ దిశగా ఈపీఎఫ్ఓ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నదా? వడ్డీ పెంపు కోసం కార్మిక సంఘాలు ఏవైనా ప్రతిపాదనలు చేశాయా? అనే ప్రశ్నలను ఆయన అడిగారు. దీనికి స్పందిస్తూ కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వడ్డీ రేటును 10 శాతానికి పెంచాలని కోరుతూ ఇప్పటివరకు కార్మిక సంఘాల నుంచి ఈపీఎఫ్ఓకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు అందలేదని మంత్రి స్పష్టం చేశారు.
వివరాలు
ఆ ఆలోచనే లేదన్న సర్కార్
ప్రస్తుతం బయట వినిపిస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, అటువంటి డిమాండ్ అధికారికంగా తమ వద్దకు రాలేదని తెలిపారు. పీఎఫ్ వడ్డీ రేటును ప్రభుత్వం లేదా ఈపీఎఫ్ఓ తమ ఇష్టానుసారం నిర్ణయించవని కూడా ఆమె పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓ సేకరించే నిధులను ప్రభుత్వ బాండ్లు, భద్రతా పత్రాలు, ఈక్విటీల వంటి పలు రంగాల్లో పెట్టుబడి చేస్తుంది. ఆ పెట్టుబడుల ద్వారా ఏడాది కాలంలో లభించే ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని వడ్డీ రేటును నిర్ణయిస్తారు. వచ్చిన లాభాల మేరకు ఖాతాదారులకు ఎంత వడ్డీ ఇవ్వగలమో అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు.
వివరాలు
10% వడ్డీ సాధ్యమా?
వడ్డీని 10 శాతానికి పెంచడం ఎందుకు సాధ్యం కాదో ప్రభుత్వం వివరించింది. దీని వెనుక 1952 ఈపీఎఫ్ పథకంలోని నిబంధనలు ప్రధాన కారణంగా ఉన్నాయి. చట్ట ప్రకారం, ఈపీఎఫ్ఓ తన పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మించిపోయే వడ్డీని చెల్లించరాదు. అలా చేస్తే సంస్థ తన అసలు మూలధనాన్ని వినియోగించాల్సి వస్తుంది. దీర్ఘకాలంలో ఇది పథకం స్థిరత్వానికి ముప్పుగా మారుతుంది. ప్రస్తుతం పెట్టుబడులపై లభిస్తున్న రాబడి 8 నుండి 8.5 శాతం మధ్యలో ఉండగా, 10 శాతం వడ్డీ ఇవ్వడం ఆర్థికపరంగా సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది. అలాంటి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఉద్యోగుల సెటిల్‌మెంట్‌లకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
వివరాలు
వడ్డీ రేటు ఎవరు నిర్ణయిస్తారు?
వడ్డీ రేటు నిర్ణయం ఒకపక్షంగా తీసుకోబడదని మంత్రి స్పష్టం చేశారు. ఇది త్రైపాక్షిక విధానంలో జరుగుతుందని తెలిపారు. ఈపీఎఫ్ఓలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT). ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, యాజమాన్యాల ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఉంటారు. ఈ అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే వడ్డీ రేటుపై సిఫార్సు చేస్తారు. అందువల్ల నిర్ణయ ప్రక్రియలో అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.