EPFO: నిలిచిన ఈపీఎఫ్ పింఛన్లు.. లక్షల మంది ఖాతాల్లో ఇంకా జమ కాలేదు!
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ద్వారా ప్రతి నెల అందించే పింఛన్లు ఈసారి ఆలస్యమయ్యాయి. సాధారణంగా ప్రతి నెల 27వ తేదీన బ్యాంకు ఖాతాల్లో జమయ్యే జులై నెల పింఛన్లు ఇప్పటికీ అందకపోవడంతో వేలాది మంది పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆలస్యానికి ఈపీఎఫ్‌వోలో చేపట్టిన కొత్త సాఫ్ట్‌వేర్ ఉన్నతీకరణ (అప్‌గ్రేడ్) కారణమని అధికారులు తెలిపారు. ఈ సమస్య ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది పింఛనుదారులపై పడింది. తెలంగాణలో సుమారు 4.63 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 3.29 లక్షల మంది ఈపీఎఫ్‌వో పింఛనుదారులకు జులై నెల పింఛన్ ఇంకా జమ కాలేదు.
వివరాలు
ఆగస్టు నుంచి మళ్లీ యథావిధిగా పింఛన్లు
ఇటీవల ఈపీఎఫ్‌వో సాఫ్ట్‌వేర్‌లో కీలక మార్పులు చేపట్టి, సెంట్రలైజ్డ్ డేటాబేస్ ద్వారా పింఛన్ల చెల్లింపు ప్రక్రియను అమలు చేస్తున్నారు.
ఈ మార్పుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పింఛన్ చెల్లింపుల స్లాట్ శుక్రవారం లభించినట్లు సమాచారం.
దీంతో శనివారం లేదా సోమవారం నాటికి పింఛన్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యే అవకాశాలు ఉన్నాయని ఈపీఎఫ్‌వో వర్గాలు వెల్లడించాయి.
జులై నెలకు మాత్రమే ఈ ఆలస్యం జరిగిందని, ఆగస్టు నుంచి మళ్లీ యథావిధిగా ప్రతి నెల పింఛన్లు పాత షెడ్యూల్ ప్రకారం చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేశారు.