EPFO: ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు ? కేంద్రం కీలక ప్రతిపాదనలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పరిధిలో గరిష్ఠ వేతన పరిమితిని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.15 వేల వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జీవన వ్యయం గణనీయంగా పెరిగినా, గత దాదాపు 12 ఏళ్లుగా ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఈ పరిమితిని పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ అంశంపై పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం కార్మికశాఖ రూ.25 వేల గరిష్ఠ వేతన పరిమితిని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
వివరాలు
సీబీటీ ఆమోదం పొందిన తర్వాతే ఈ నిర్ణయం అమల్లోకి..
ఇటీవల ఈపీఎఫ్‌వో కొత్త ఈపీఎఫ్-26, ఈపీఎస్-26 విధానాలను అమల్లోకి తీసుకురాగా, ఇప్పుడు వేతన పరిమితి పెంపుకు అవసరమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో కనీస పింఛను పెంపు ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
గరిష్ఠ వేతన పరిమితి పెంపునకు ఆర్థిక శాఖ ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ప్రతిపాదిత మార్పులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించిన తర్వాత ఈపీఎఫ్‌వో తన పథకాల్లో అవసరమైన సవరణలు చేపడుతుంది.
అనంతరం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఆమోదం పొందిన తర్వాతే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పట్టే అవకాశముందని ఈపీఎఫ్‌వో వర్గాలు, కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
వివరాలు
ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు
గరిష్ఠ వేతన పరిమితి రూ.25 వేలకు పెరిగితే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో ప్రతి నెల జమయ్యే మొత్తం కూడా పెరుగుతుంది.
ప్రస్తుతం రూ.15 వేల వేతన పరిమితిపై ఉద్యోగి నుంచి 12 శాతం చొప్పున రూ.1,800 ఈపీఎఫ్‌కు జమవుతోంది.
అదే పరిమితిని రూ.25 వేలకు పెంచితే ఉద్యోగి వాటా రూ.3 వేల వరకు పెరుగుతుంది.
ఉద్యోగి చెల్లించే మొత్తానికి సమానంగా యజమాని కూడా 12 శాతం వాటాను జమ చేస్తారు.
ఇందులో 8.33 శాతం ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్)కు వెళ్తుండగా, మిగిలిన మొత్తం ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది.
దీంతో పదవీ విరమణ సమయానికి ఉద్యోగి పీఎఫ్ నిల్వ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
వివరాలు
పింఛనుపై ప్రభావం
గరిష్ఠ వేతన పరిమితి రూ.25 వేలకు పెరిగితే పదవీ విరమణ తర్వాత అందే పింఛనుపైనా ప్రభావం ఉంటుంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న దామాషా విధానంలోనే పింఛను లెక్కింపు కొనసాగుతోంది.
కొత్త పరిమితి అమల్లోకి వచ్చిన తేదీ నుంచి పదవీ విరమణ వరకు చేసిన సేవా కాలానికి రూ.25 వేల వేతనాన్ని ఆధారంగా తీసుకుని పింఛను లెక్కిస్తారు.
అలాగే 2014 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీ వరకు చేసిన సేవకు రూ.15 వేల వేతనాన్ని, 2014కు ముందు చేసిన సేవకు రూ.6,500 వేతనాన్ని ప్రాతిపదికగా తీసుకుని పింఛను లెక్కిస్తారు.
వివరాలు
పింఛనుపై ప్రభావం
ఈ మూడు దశలకు సంబంధించిన మొత్తాలను కలిపి తుది పింఛను నిర్ణయిస్తారు.
అయితే పింఛను లెక్కింపు విధానం లేదా గరిష్ఠ పింఛను అర్హత వేతనానికి సంబంధించిన నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేస్తే, వాటి ప్రభావం తుది పింఛను మొత్తంపై కూడా పడే అవకాశం ఉంది.