Loading...
EPFO: 10 ఏళ్ల పాటు పీఎఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆలస్యం.. ఉద్యోగికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని EPFOకి ఆదేశం
ఉద్యోగికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని EPFOకి ఆదేశం

EPFO: 10 ఏళ్ల పాటు పీఎఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆలస్యం.. ఉద్యోగికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని EPFOకి ఆదేశం

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగి పాత పీఎఫ్‌ ఖాతా నుంచి కొత్త ఖాతాకు నగదు బదిలీ చేయడంలో దాదాపు 10 ఏళ్లు ఆలస్యం చేసినందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO)పై చండీగఢ్‌ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాఫ్ట్‌వేర్‌ సమస్యలను కారణంగా చూపుతూ ఇంతకాలం ఆలస్యం చేయడం సరైంది కాదని స్పష్టం చేసింది. బాధిత ఉద్యోగికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఈపీఎఫ్ఓను ఆదేశించింది. ఈ కేసు 2009లో టెక్‌ మహీంద్రాలో పనిచేసిన ఓ ఉద్యోగికి సంబంధించినది. 2010లో అతను ఇన్ఫోసిస్‌లో చేరడంతో రెండు వేర్వేరు పీఎఫ్‌ ఖాతాలు ఏర్పడ్డాయి. దీంతో పాత ఖాతాలోని డబ్బును కొత్త ఖాతాకు బదిలీ చేయాలని ఉద్యోగి దరఖాస్తు చేశాడు.

వివరాలు 

2011లో ఆర్‌టీఐ దాఖలు చేసిన ఉద్యోగి 

అయితే ఈపీఎఫ్ఓ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో 2011లో ఆర్‌టీఐ దాఖలు చేశాడు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.

దాదాపు పదేళ్ల పాటు లేఖల మార్పిడి కొనసాగిన తర్వాత 2020 ఏప్రిల్‌ 16న EPFO రూ.6.21 లక్షలను ఉద్యోగి కొత్త ఖాతాకు బదిలీ చేసింది.

అయితే తన లెక్కల ప్రకారం రూ.11.07 లక్షలు రావాల్సి ఉందని ఉద్యోగి వాదించాడు.

ఖాతా 2011 నుంచి 'ఇనాపరేటివ్‌'గా మారడంతో 2012-13 నుంచి 2015-16 వరకు వడ్డీ జమ కాలేదని EPFO తెలిపింది.

వివరాలు 

ఉద్యోగికి రూ.50 వేల పరిహారం

దీంతో ఉద్యోగి 2021లో మరోసారి ఆర్‌టీఐ దాఖలు చేసి, తర్వాత వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.

సాంకేతిక లోపం వల్ల వడ్డీ జమ కాలేదని EPFO వాదించినా, కమిషన్‌ మాత్రం ఇది సేవల లోపమేనని తేల్చింది.

ఉద్యోగి ఎదుర్కొన్న మానసిక ఇబ్బందులు, న్యాయ ఖర్చుల కోసం రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

60 రోజుల్లోగా చెల్లించకపోతే 9 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ADVERTISEMENT