EPFO New plan: ఈపీఎఫ్‌ఓలో కొత్త విధానం.. రిటైర్మెంట్ తర్వాత విడతలవారీగా పీఎఫ్ విత్‌డ్రా!
ఈ వార్తాకథనం ఏంటి
పదవీ విరమణ తర్వాత ఉద్యోగులు తమ పీఎఫ్ (PF) ఖాతాలోని మొత్తం నగదును ఒకేసారి ఉపసంహరించుకునే విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) సిద్ధమవుతోంది. రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ సొమ్మును ఒకేసారి తీసుకోకుండా, అవసరానికి అనుగుణంగా విడతలవారీగా విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించాలని యోచిస్తోంది. ఇందుకోసం సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్ (SWP)ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్స్ స్కీమ్-2026లో సవరణలు
ప్రస్తుతం ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత తమ పీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నారు.
ఇలా ఒకేసారి చేతికి వచ్చే పెద్ద మొత్తాన్ని ఇతర పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడిగా పెడుతున్నట్లు ఈపీఎఫ్‌ఓ వర్గాలు గుర్తించాయి.
అయితే, ఇతర పెట్టుబడి సాధనాలు ఈపీఎఫ్‌ఓ అందించే స్థాయి భద్రత, రాబడిని కల్పించలేకపోతున్నాయని అభిప్రాయపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో పీఎఫ్ నిధులను విడతలవారీగా తీసుకునే వెసులుబాటు కల్పిస్తే చందాదారులకు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నాయి.
ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్స్ స్కీమ్-2026లో అవసరమైన సవరణలు చేయాల్సి ఉంటుంది.
వివరాలు
ఎలా పనిచేస్తుంది ఈ సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్?
ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం.. 55 ఏళ్లు దాటిన తర్వాత ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలోని నిధులను పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు.
అయితే, వారికి 58 ఏళ్లు నిండిన తర్వాతే పెన్షన్ ప్రయోజనాలు ప్రారంభమవుతాయి.
ఒకవేళ ఉద్యోగులు 55 ఏళ్లలోపే పదవీ విరమణ చేస్తే, పీఎఫ్ ఖాతాలోని మొత్తంలో 75 శాతం మాత్రమే వెంటనే వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది.
మిగిలిన 25 శాతం మొత్తాన్ని రిటైర్మెంట్ తర్వాత లేదా వరుసగా 12 నెలల పాటు నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఉపసంహరించుకోవచ్చు.
ఈ నిబంధనల్లో భాగంగా రిటైర్మెంట్ తర్వాత అందుబాటులోకి వచ్చే పీఎఫ్ నిధులను ఒకేసారి తీసుకోకుండా, నిర్ణీత వ్యవధుల్లో కొంత మొత్తం చొప్పున వెనక్కి తీసుకునే అవకాశాన్ని కొత్త పథకం ద్వారా కల్పించనున్నారు.
వివరాలు
ఎలా పనిచేస్తుంది ఈ సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్?
చందాదారులు తమ అవసరాన్ని బట్టి ప్రతి నెలా,మూడు నెలలకు ఒకసారి,ఆరు నెలలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి నిర్దిష్ట మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.
ఇలా కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసిన తర్వాత కూడా ఖాతాలో మిగిలిన నిధిపై యథావిధిగా వడ్డీ కొనసాగుతుంది.
అంతేకాదు.. ఈ సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్‌లో చేరిన తర్వాత ఎప్పుడైనా దాని నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా కల్పించనున్నారు.
చందాదారుడి జీవిత భాగస్వామి లేదా నామినీ సైతం ఈ పథకాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉండనుంది.
వారు కూడా తమకు అవసరమైన సమయంలో ఈ విధానం నుంచి వైదొలగవచ్చు.
అయితే,ఈ ప్రతిపాదనకు సంబంధించి మరిన్ని వివరాలు, నిబంధనలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.