EPFO PF claim delay: పీఎఫ్ క్లెయిమ్ 35 రోజుల ఆలస్యానికి వడ్డీ కట్టాల్సిందే.. 6 శాతం పెనాల్టీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)కు ముంబై వినియోగదారుల కమిషన్ గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) క్లెయిమ్‌ను నిర్ణీత గడువులోగా పరిష్కరించకుండా 35 రోజులు ఆలస్యం చేసినందుకు.. ఆ కాలానికి 6 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలైనా సరే.. నిబంధనల ప్రకారం అందించాల్సిన సేవల్లో జాప్యం చేస్తే బాధ్యత తప్పదని ఈ తీర్పు స్పష్టం చేసింది. ముంబై సబర్బన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇటీవల ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్లీట్ మెరైన్ సర్వీసెస్‌లో పనిచేసి పదవీ విరమణ చేసిన ఓ ఉద్యోగికి రావాల్సిన రూ.14,06,272 పీఎఫ్ క్లెయిమ్‌ను పరిష్కరించడంలో ఈపీఎఫ్‌ఓ నిర్లక్ష్యం చేసిందని కమిషన్ నిర్ధారించింది.
వివరాలు
మొదటి దరఖాస్తు అసంపూర్తిగా ఉందన్న ఈపీఎఫ్‌ఓ
ఈపీఎఫ్ స్కీమ్-1952 నిబంధనల ప్రకారం, పీఎఫ్ క్లెయిమ్‌కు సంబంధించిన దరఖాస్తును 20 రోజుల్లోగా పరిష్కరించాలి.
అయితే ఈ కేసులో 2016 నవంబర్ 9 నుంచి డిసెంబర్ 13 వరకు 35 రోజుల జాప్యం జరిగింది.
దీంతో ఆ ఆలస్య కాలానికి సంవత్సరానికి 6 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని కమిషన్ ఈపీఎఫ్‌ఓను ఆదేశించింది.
తాను 2016 అక్టోబర్ 19న అవసరమైన వివరాలతో పీఎఫ్ క్లెయిమ్ దరఖాస్తు సమర్పించినట్లు ఉద్యోగి కమిషన్‌కు తెలిపారు.
అయితే ఈపీఎఫ్‌ఓ ఇందుకు భిన్నంగా వాదించింది. ఉద్యోగి మొదట సమర్పించిన దరఖాస్తులో జాయింట్ డిక్లరేషన్‌కు సంబంధించిన పత్రాలు సక్రమంగా లేవని పేర్కొంది.
అందుకే ఆ పత్రాలను నవంబర్ 7న తిరిగి పంపించినట్లు తెలిపింది.
వివరాలు
మొదటి దరఖాస్తు అసంపూర్తిగా ఉందన్న ఈపీఎఫ్‌ఓ
ఆ తర్వాత డిసెంబర్ 2న పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు అందిందని ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది.
ఆ తేదీ నుంచి లెక్కిస్తే 20 రోజుల్లోపే, డిసెంబర్ 14న పీఎఫ్ క్లెయిమ్‌ను పరిష్కరించామని వాదించింది.
అయితే మొదట సమర్పించిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలను ఈపీఎఫ్‌ఓ కమిషన్ ముందు సమర్పించలేకపోయింది.
అలాగే ఆ దరఖాస్తును తిరస్కరిస్తూ ఉద్యోగికి సమాచారం ఇచ్చినట్లు చూపించే ఆధారాలు కూడా లేవని తేలింది.
వివరాలు
సేవల్లో లోపమే.. 45 రోజుల్లో పరిహారం చెల్లించాలి
ఉద్యోగి సమర్పించిన ఆధారాలను పరిశీలించిన ముంబై సబర్బన్ జిల్లా వినియోగదారుల కమిషన్.. ఈపీఎఫ్‌ఓ వాదనలను అంగీకరించలేదు.
2016 అక్టోబర్ 19న సమర్పించిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందని నిరూపించడానికి సంస్థ వద్ద సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
నిర్దేశించిన గడువులోగా పీఎఫ్ క్లెయిమ్‌ను పరిష్కరించకపోవడం ఈపీఎఫ్‌ఓ అందించిన సేవల్లో లోపమేనని కమిషన్ తేల్చింది.
ఈ జాప్యానికి ఈపీఎఫ్‌ఓనే బాధ్యత వహించాలని పేర్కొంది. 35 రోజుల ఆలస్యానికి సంవత్సరానికి 6 శాతం వడ్డీతో పాటు వర్తించే పరిహారాన్ని బాధిత ఉద్యోగికి 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.