LOADING...
EPFO: ఈపీఎఫ్‌ సభ్యులకు గుడ్‌న్యూస్‌.. పాస్‌బుక్‌, క్లెయిమ్‌ సేవలు తిరిగి ప్రారంభం
ఈపీఎఫ్‌ సభ్యులకు గుడ్‌న్యూస్‌.. పాస్‌బుక్‌, క్లెయిమ్‌ సేవలు తిరిగి ప్రారంభం

EPFO: ఈపీఎఫ్‌ సభ్యులకు గుడ్‌న్యూస్‌.. పాస్‌బుక్‌, క్లెయిమ్‌ సేవలు తిరిగి ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2026
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు 15 రోజుల పాటు నిలిచిపోయిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఆన్‌లైన్‌ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే వారం రోజుల క్రితం మెంబర్‌ పోర్టల్‌ను పునరుద్ధరించిన ఈపీఎఫ్‌వో.. తాజాగా సభ్యులు ఎక్కువగా వినియోగించే పాస్‌బుక్‌ సేవలను కూడా ప్రారంభించింది. దీంతో ఖాతాదారులు తమ ఈపీఎఫ్‌ నిల్వలు, వడ్డీ వివరాలను మళ్లీ ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం కలిగింది. సాఫ్ట్‌వేర్‌ ఉన్నతీకరణ పనుల్లో భాగంగా ఈపీఎఫ్‌-2026 కొత్త పథకం నిబంధనలకు అనుగుణంగా ఆన్‌లైన్‌లో వచ్చిన క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియను ఇటీవల సంస్థ తిరిగి ప్రారంభించింది. మిగిలిన సేవలను కూడా దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తున్నామని, మరో వారం రోజుల్లో అన్ని సేవలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడతాయని ఈపీఎఫ్‌వో వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

80 శాతం ఈపీఎఫ్‌ ఖాతాల్లో వడ్డీ మొత్తం జమ

కొత్త ఈపీఎఫ్‌, ఈపీఎస్‌, ఈడీఎల్‌ఐ-2026 పథకాల అమలు, సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌, ఆటోమేషన్‌ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడం వంటి చర్యల కోసం జూన్‌ 26 నుంచి ఈపీఎఫ్‌వో సర్వర్ల నిర్వహణ పనులు చేపట్టింది. ఈ కారణంగా కొత్త క్లెయిమ్‌ల స్వీకరణతో పాటు వాటి పరిష్కార ప్రక్రియను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. అదే సమయంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు 80 శాతం ఈపీఎఫ్‌ ఖాతాల్లో వడ్డీ మొత్తాన్ని జమ చేసినట్లు సంస్థ వెల్లడించింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా పాక్షిక నగదు ఉపసంహరణ (పార్టియల్‌ విత్‌డ్రాయల్‌) క్లెయిమ్‌ల ప్రక్రియలోనూ మార్పులు చేసింది. మెంబర్‌ పోర్టల్‌ను అప్‌గ్రేడ్‌ చేసి పాక్షిక ఉపసంహరణకు సంబంధించిన క్లెయిమ్‌ల సంఖ్యను నాలుగుకు పరిమితం చేసింది.

వివరాలు 

వడ్డీతో కలిపిన మొత్తం నిల్వలో కనీసం 25 శాతం

అలాగే సభ్యుడి ఖాతాలో వడ్డీతో కలిపిన మొత్తం నిల్వలో కనీసం 25 శాతం తప్పనిసరిగా మిగిలి ఉండేలా కొత్త విధానాన్ని అమలు చేసింది. మిగిలిన 75 శాతం మొత్తాన్ని మాత్రమే ఉపసంహరణకు అర్హమైన నగదుగా పోర్టల్‌లో చూపిస్తోంది. దీంతో సభ్యుడు తన ఖాతా నుంచి గరిష్ఠంగా ఎంత మొత్తం ఉపసంహరించుకోవచ్చో ముందుగానే స్పష్టంగా తెలుసుకునే అవకాశం కలుగుతోంది.

Advertisement