EPFO: ఈపీఎఫ్ఓలో భారీగా పెరిగిన సభ్యులు; జూన్‌లో 17.89 లక్షల మంది చేరిక
ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)లో సభ్యత్వం పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జూన్ నెలలో అత్యధికంగా ఈపీఎఫ్ఓలో 17.89 లక్షల మంది నికర సభ్యులుగా చేరారు. ఈ మేరకు ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నివేదికను విడుదల చేసింది. దాదాపు 3,491 సంస్థలు తమ కొత్త ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాన్ని కల్పించినట్లు వెల్లడించింది. మే 2023తో పోల్చితే జూన్‌లో9.71శాతం వృద్ధి నమోదైనట్లు ఈపీఎఫ్ఓ చెప్పింది. ఆగస్ట్ 2022 నుంచి ఈపీఎఫ్ఓలో కొత్త సభ్యుల చేరడం ఇదే అత్యధికం. అంతేకాకుండా, గత పదకొండు నెలల కంటే జూన్‌లో అత్యధిక మొత్తం చెల్లింపులు నమోదైనట్లు ఈపీఎఫ్ఓ డేటా చెబుతోంది.
ఆ ఐదు రాష్ట్రాల నుంచి ఈపీఎఫ్ఓలో ఎక్కువ చేరికలు
2023 జూన్‌లో దాదాపు 10.14లక్షల మంది కొత్త సభ్యులు ఈపీఎఫ్ఓ సభ్యులుగా నమోదు చేసుకున్నారని లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొత్త సభ్యుల్లో దాదాపు 2.81 లక్షల మంది మహిళలు ఉండటం విశేషం. మరోవైపు, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యానా నికర సభ్యుల చేర్పులలో ముందంజలో ఉన్నాయి. మొత్తం చేరికల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటా 60.4శాతంగా ఉంది. గతేడాది ఆగస్టు నుంచి కొత్త సభ్యులు చేరడం ఇదే అత్యధికం. కొత్తగా చేరిన సభ్యులలో 18-25సంవత్సరాల వయస్సు గలవారు 57.87% ఉన్నారు. ఇదిలా ఉంటే, సుమారు 12.65 లక్షల మంది సభ్యులు ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగాలు మారినట్లు ఈపీఎఫ్ఓ పేరోల్ డేటా స్పష్టం చేసింది.