EPFO: ఈపీఎస్ కనీస పింఛను రూ.3 వేలకు పెంపు? ఈపీఎఫ్‌వో కసరత్తు
ఈ వార్తాకథనం ఏంటి
ఈపీఎస్ పింఛనుదారులకు త్వరలో శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నెలకు కనీసంగా ఇస్తున్న రూ.1,000 పింఛనును రూ.3,000కు పెంచేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో కార్మికశాఖ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నెల 19న జరగనున్న ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ అంశాన్ని ప్రత్యేక ఎజెండాగా చేర్చి చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పింఛను పెంపుపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 81.48 లక్షల మంది ఈపీఎస్ పింఛనుదారులు ఉన్నారు. వీరిలో సుమారు 73.55 లక్షల మందికి నెలకు రూ.3,000 కంటే తక్కువ పింఛను అందుతోంది.
వివరాలు
2014లో కనీస పింఛను రూ.1,000కు పెంపు
కనీస పింఛను పెంపు నిర్ణయం అమల్లోకి వస్తే వీరందరికీ ప్రయోజనం కలగనుంది.
ఈపీఎఫ్‌వో 2014లో వేతన పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000కు పెంచిన సమయంలో కనీస పింఛనును కూడా పెంచాలని నిర్ణయించింది.
అప్పట్లో దాదాపు 80 శాతం మంది పింఛనుదారులకు నెలకు రూ.1,000 కంటే తక్కువ మొత్తమే అందేది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కనీస పింఛనును నెలకు రూ.1,000గా నిర్ణయించారు.
అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ మొత్తాన్ని పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.
వివరాలు
తెలంగాణలో సుమారు 5 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి
సీబీటీ సమావేశాల్లోనూ పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించాయి.
ఇదిలా ఉండగా, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇటీవల సెప్టెంబరులో ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది.
దీంతో కనీస పింఛనును కూడా రూ.3,000కు పెంచాలనే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే తెలంగాణలో సుమారు 5 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది.