Evergrande: రెండేళ్లలో ఏకంగా రూ.6లక్షల కోట్ల నష్టం; తీవ్ర సంక్షోభంలో చైనా కంపెనీ 'ఎవర్‌గ్రాండే'
చైనాకు చెందిన ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ సంస్థ 'ఎవర్‌గ్రాండే' పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. 2021, 2022లో కలిపి సంస్థ 81 బిలియన్ డాలర్ల(రూ.6లక్షల కోట్లు) నష్టాన్ని నమోదు చేసింది. హాంగ్‌సెంగ్ షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ కోసం చేసిన దరఖాస్తులో ఎవర్‌గ్రాండే కంపెనీ తన నష్టాలు, ఇతర ఫలితాల వివరాలను వెల్లడించింది. 'ఎవర్‌గ్రాండే'ను 2021 చివరలో డిఫాల్ట్ కంపెనీగా ప్రకటంచారు. 2022లో 14.8 బిలియన్ డాలర్ల నష్టం వచ్చినట్లు కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది. మిలిగిన నష్టం 2021లో నమోదైనట్లు చెప్పింది. చైనాలోనే అతిపెద్ద రుణాల కుప్పగా ఎవర్‌గ్రాండే కంపెనీని ఆ దేశ మార్కెట్ విశ్లేషకులు చెబుతుంటారు.
సెంట్రల్ బ్యాంకు కొత్త నిబంధనలతో పీకల్లోతు నష్టాల్లో ఎవర్‌గ్రాండే
ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాకు ఎవర్‌గ్రాండే కంపెనీ అప్పులు తీవ్ర తల నొప్పిగా మారాయి. అయితే చైనా ప్రభుత్వం తీసుకున్న కొని చర్యల వల్ల దేశంలో గృహ సంక్షోభం ఏర్పడింది. 2020లో ప్రాపర్టీ డెవలపర్ సంస్థలు విచ్చిలవిడిగా రుణాలు తీసుకోకుండా ఆ దేశ సెంట్రల్ బ్యాంకు నిబంధనలను కఠినతరం చేయడంతో ఎవర్‌గ్రాండే కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి. 2021 నాటికి ఏకంగా దివాలా తీసింది. హాంకాంగ్ షేర్ మార్కెట్‌లో లిస్ట్ అయిన ఎవర్‌గ్రాండే షేర్లు డీ లిస్ట్ కాకుండా పునరుద్ధరణ కోసం ఎవర్‌గ్రాండే సోమవారం స్టాక్ ఏజెన్సీలో తన ఫైలింగ్‌ను అందజేసింది. అందులో ఆ కంపెనీ అప్పులు కుప్ప ఎంతో తెలిసి మార్కెట్ నిపుణులు ఆశ్చర్యపోయారు.