Gold and silver prices: బంగారం,వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. పెరుగుదలకు ప్రధాన కారణాలివే..!
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం,వెండి ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ (MCX)లో వరుసగా మూడో రోజూ ఈ రెండు విలువైన లోహాల ధరలు లాభాల దిశగా కొనసాగాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే బంగారం ధర రూ.6 వేలకుపైగా పెరగగా, వెండి ధర దాదాపు రూ.11 వేల మేర ఎగబాకింది. దీంతో దేశీయ కమొడిటీ మార్కెట్‌లో మళ్లీ కొనుగోలు ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో అక్టోబర్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.757 పెరిగి రూ.1.49 లక్షల వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా సెప్టెంబర్ డెలివరీ సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ.228 లాభపడి రూ.2.27 లక్షల వద్ద కొనసాగుతోంది.
వివరాలు
కిలో వెండి ధర @ రూ.2.31 లక్షలు
అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు బలంగానే ఉన్నాయి.
ఔన్సు బంగారం ధర 4,257 డాలర్ల వద్ద ఉండగా, ఔన్సు వెండి 61.83 డాలర్లకు చేరింది.
ఇదే సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.95.23గా నమోదైంది.
ఈ పరిణామాల ప్రభావంతో గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పన్నులతో కలిపి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.52 లక్షలకు చేరుకుంది.
ఇటీవల చాలా రోజుల పాటు రూ.1.45 లక్షల వద్ద స్థిరంగా ఉన్న బంగారం ధర ఇప్పుడు మరోసారి పైకి ఎగిసింది. ఇక కిలో వెండి ధర రూ.2.31 లక్షలుగా కొనసాగుతోంది.
వివరాలు
ధరలు పెరగడానికి కారణాలివే..
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల సమయంలో ద్రవ్యోల్బణ భయాలు, డ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశాలపై అంచనాల కారణంగా బంగారం,వెండి ధరలు భారీగా తగ్గాయి.
ఆ సమయంలో బంగారం ధర తన గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 19 శాతం వరకు క్షీణించింది.
అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు క్రమంగా శాంతియుత దిశగా మారుతున్నాయి.
ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచే అంశంపై ఇరాన్, ఒమన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపించడం మార్కెట్‌కు ఊరటనిచ్చింది.
వివరాలు
ధరలు పెరగడానికి కారణాలివే..
దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర మళ్లీ 80 డాలర్ల దిగువకు చేరుకుంది.
మరోవైపు అమెరికా డాలర్ బలహీనపడటం, ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం, ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచకపోవచ్చనే అంచనాలు బలపడటం కూడా విలువైన లోహాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి.
ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తిరిగి బంగారం, వెండి కొనుగోళ్లపై ఆసక్తి చూపడంతో రెండు లోహాల ధరలు మరోసారి వేగంగా పెరుగుతున్నాయి.