FAAMNG firms: భారత్‌లో FAAMNG కంపెనీల నియామకాలు పెరుగుదల.. 2026లో 13,600 మందికి ఉద్యోగాలు
ఈ వార్తాకథనం ఏంటి
మెటా, అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్, గూగుల్ వంటి FAAMNG టెక్ దిగ్గజాలు 2026లో ఇప్పటివరకు భారత్‌లో సుమారు 13,600 మందిని నియమించాయి. ప్రత్యేక నియామక సంస్థ ఎక్స్‌ఫెనో (Xpheno) వివరాల ప్రకారం, గత ఏడాది ఇదే సమయంలో 12,800 మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరగా, ఈ ఏడాది ఆ సంఖ్య 6 శాతం పెరిగింది. అయితే కంపెనీలు ఇప్పటికీ జాగ్రత్తగా నియామకాలు చేపడుతూ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, కోర్ ఇంజినీరింగ్ వంటి రంగాలపై దృష్టి సారిస్తున్నాయి.
వివరాలు
2026 చివరి నాటికి భారత్‌లో బిగ్ టెక్ నియామకాలు 16 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు, AI నైపుణ్యాలపై పెరుగుతున్న డిమాండ్, ఉద్యోగుల నిర్మాణంలో మార్పులను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు అవసరమైన పోస్టులకే నియామకాలు చేపడుతున్నాయి. అయినప్పటికీ, 2026 చివరి నాటికి భారత్‌లో బిగ్ టెక్ నియామకాలు 16 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని టీమ్‌లీజ్ డిజిటల్ అంచనా వేస్తోంది. ముఖ్యంగా AI, క్లౌడ్, ప్లాట్‌ఫామ్ ఇంజినీరింగ్, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (GCC) విస్తరణ ఈ వృద్ధికి దోహదం చేయనున్నాయి. గత ఏడాది FAAMNG కంపెనీలు,వాటి అనుబంధ సంస్థలు భారత్‌లో దాదాపు 32,000 మందిని నియమించుకుని గత మూడు సంవత్సరాల్లో అత్యధిక నికర నియామకాల రికార్డు నమోదు చేశాయి.
వివరాలు
మెటా ఉద్యోగాల కోతల ప్రభావం
2026 తొలి ఆరు నెలల్లో ఒరాకిల్, మెటా, మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్‌ఇన్ వంటి అమెరికన్ టెక్ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టాయి. ఈ ప్రభావం భారత ఉద్యోగులపైనా పడింది.మరోవైపు H-1B వీసా ఫీజును 1 లక్ష డాలర్లకు పెంచే ప్రతిపాదనలు,అమెరికాలో కఠినతరమైన వీసా విధానాలు అనిశ్చితిని మరింత పెంచాయి. ఏప్రిల్‌లో మెటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 మందిని, అంటే మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. AIపై భారీ పెట్టుబడుల నేపథ్యంలో సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య భారత్‌లోని పలు ఉద్యోగాలపై కూడా ప్రభావం చూపింది. అలాగే గతంలో భర్తీ చేయాలని భావించిన 6,000 ఖాళీలను కూడా నింపబోమని కంపెనీ తెలిపింది.
వివరాలు
మెటా నికర నియామకాలు 4,400గా నమోదు
అయితే నియామకాల వేగం తగ్గినప్పటికీ,మెటా,దాని 33 అనుబంధ సంస్థలు కలిసి 2026లో ఇప్పటివరకు భారత్‌లో 1,600 మందిని నియమించుకున్నట్లు ఎక్స్‌ఫెనో వెల్లడించింది. గత 12 నెలల్లో మెటా నికర నియామకాలు 4,400గా నమోదయ్యాయి. మెటా ప్రధాన భారత విభాగంలో సుమారు 400 నుంచి 500 మంది ఉద్యోగులు ఉండగా, అనుబంధ సంస్థలు, పెట్టుబడి విభాగాలు, ఇతర వ్యాపార యూనిట్లలో కలిపి దాదాపు 15,000 మంది పనిచేస్తున్నారని ఎక్స్‌ఫెనో పేర్కొంది. ప్రస్తుతం మెటా,దాని అనుబంధ సంస్థల్లో భారత్‌లో కేవలం 10 యాక్టివ్ ఉద్యోగ ఖాళీలు మాత్రమే ఉన్నాయి. 2025 డిసెంబరులో ఈ సంఖ్య 50గా ఉండటం గమనార్హం.టెక్ రంగంలో కొనసాగుతున్న మందగమనానికి అనుగుణంగానే ఈ పరిస్థితి ఉందని ఎక్స్‌ఫెనో సీఈఓ ఫ్రాన్సిస్ పదమదన్ తెలిపారు.
వివరాలు
అమెరికా విధానాల ప్రభావం
టీమ్‌లీజ్ డిజిటల్ సీఈఓ నీతి శర్మ ప్రకారం, భారత్‌లో బిగ్ టెక్ నియామకాల భవిష్యత్ సానుకూలంగానే ఉన్నప్పటికీ, కంపెనీలు అవసరమైన నైపుణ్యాలున్న అభ్యర్థులనే జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ నియామకాలు కొనసాగిస్తాయి. H-1B వీసా ఖర్చులు పెరగడంతో అమెరికాలో ఉద్యోగులను నియమించుకోవడం కంపెనీలకు మరింత ఖరీదుగా మారింది. దీంతో AI, డీప్‌టెక్ రంగాలకు సంబంధించిన ప్రతిభావంతుల కోసం భారత మార్కెట్‌పై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. మరోవైపు అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించిన HIRE చట్టం కూడా అవుట్‌సోర్సింగ్‌ను తగ్గించి, దేశీయ ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకు వస్తోంది. విదేశీ ఉద్యోగులకు చెల్లించే సేవా చెల్లింపులపై 25 శాతం పన్ను విధించే ప్రతిపాదన కూడా కంపెనీల వ్యూహాలపై ప్రభావం చూపుతోంది.
వివరాలు
ఏ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్?
టీమ్‌లీజ్ డేటా ప్రకారం AI/ML,క్లౌడ్ కంప్యూటింగ్,డేటా ఇంజినీరింగ్,సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఉద్యోగాల డిమాండ్ 25-30శాతం పెరిగింది. GCC నియామకాలలో మధ్యస్థాయి,సీనియర్ స్థాయి ఉద్యోగుల వాటా 2023లో 60శాతం ఉండగా, ప్రస్తుతం 77 శాతానికి చేరింది. జెన్‌ఏఐ ఇంజినీర్లు, క్లౌడ్ ఆర్కిటెక్టులు, సైబర్ సెక్యూరిటీ అనలిస్టులకు భారీ డిమాండ్ ఉంది. మరోవైపు బ్యాక్‌ఎండ్ డెవలపర్లు, IT ఆపరేషన్స్‌కు సంబంధించిన కొన్ని సంప్రదాయ ఉద్యోగాల డిమాండ్ తగ్గుతోంది. టెక్ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం కాదని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలు కలిగిన ప్రతిభను మాత్రమే ఎంపిక చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న కీలక టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యతలను భారత్‌కు మరింతగా అప్పగించే దిశగా సంస్థలు అడుగులు వేస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.