Reliance- Disney: రిలయన్స్- డిస్నీ విలీన ప్రక్రియ.. జనవరి నాటికి పూర్తి!
భారత్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా రంగంలో మరో భారీ విలీనానికి రంగం సిద్ధమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), వాల్ట్ డిస్నీ కంపెనీ భారతదేశంలో తమ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ కార్యకలాపాలను విలీనం చేయడానికి చర్చల చివరి దశలో ఉన్నాయి. ఇరు సంస్థల విలీనం దాదాపు ఖరారైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలుడుతున్నాయి. ఈ ఒప్పందం విజయవంతమైతే, భారతదేశంలోని అతిపెద్ద మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఐర్ఐఎల్ మెజారిటీ వాటాదారుగా నిలవనుంది. ఇదిలా ఉంటే, స్టార్ ఇండియాకు ప్రస్తుతం 77ఛానళ్లు.. వయాకామ్‌కు 38 ఛానల్స్ ఉన్నాయి.
విలీన సంస్థలో రిలయన్స్‌కు 51శాతం వాటా
రిలయన్స్ వయాకామ్ 18కి అనుబంధంగా విలీన సంస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో రిలయన్స్ కనీసం 51% మెజారిటీ వాటాను కోరుకుంటున్నట్లు సమాచారం. డిస్నీకి ఆ సంస్థలో 49 శాతం షేర్ ఉంటుందని తెలుస్తోంది. విలీన సంస్థ నియంత్రణ అధికారాన్ని రిలయన్స్ పొందేందుకు ఆసక్తిని కనబరుస్తోంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని డిస్నీకి రిలయన్స్ చెల్లించనుంది. అయితే ఎంత చెల్లిస్తుందనేది తెలియాల్సి ఉంది. అయితే విలీన సంస్థ బోర్డులో మాత్రం అటు రిలయన్స్, ఇటు డిస్నీకి సమాన ప్రాతినిధ్యం ఉంటుందని తెలుస్తోంది. 2024, జనవరి నాటికి ఇరు సంస్థల విలీనం అంశం పూర్తయ్యే అవకాశం ఉంది.