Nirmala Sitharaman: వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు బ్యాంకింగ్.. త్వరలో ఉన్నతస్థాయి కమిటీ
ఈ వార్తాకథనం ఏంటి
'వికసిత్ భారత్ 2047' లక్ష్యాన్ని సాధించడంలో బ్యాంకింగ్ రంగం పాత్రను సమీక్షించేందుకు త్వరలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ రంగం కోసం ఈ కమిటీ దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించనుంది. రాబోయే రెండు దశాబ్దాల్లో దేశాభివృద్ధికి అవసరమైన మార్పులు, సంస్కరణలపై సూచనలు ఇవ్వనుందని ఆమె వెల్లడించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల సదస్సులో మాట్లాడుతూ ఆమె ఈ వివరాలు తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై తమ సిఫార్సులు, సూచనలను అందించాలని బ్యాంకుల అధిపతులను ఈ సందర్భంగా కేంద్రమంత్రి కోరారు.
వివరాలు
20 ఏళ్లలో బ్యాంకింగ్ రంగాన్ని సిద్ధం చేయాలి
వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రస్తుతం మరో 20 ఏళ్లు మాత్రమే ఉన్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు.
ఈ పరిమిత కాలంలో దేశ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ రంగాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (NPAs) కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో రాబోయే రెండు దశాబ్దాల ఆర్థిక వృద్ధికి అవసరమైన సంస్కరణలను వేగవంతం చేయడానికి ఇదే సరైన సమయమని ఆమె అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఏడు అంశాలపై ప్రత్యేక చర్చ
బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన కాన్‌క్లేవ్‌లో చర్చించాల్సిన ఏడు ప్రధాన అంశాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గుర్తించిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
యువతకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు సంబంధించిన అంశాలు, ప్రాధాన్య రంగాలకు రుణాల అందజేత, క్రెడిట్ కార్డు వ్యాపారాన్ని పునర్నిర్మించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పారు.
ముఖ్యంగా యువతపై బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్రమంత్రి సూచించారు.
తమ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించే సమయంలో దేశ డెమోగ్రఫిక్ ప్రొఫైల్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బ్యాంకులకు సూచించారు.