AP Assembly Session: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. ఆరు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలను నాలుగు రోజులపాటు నిర్వహించే అవకాశం ఉంది. తొలిరోజు ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటల తర్వాత బ్రేక్ సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశం జరగనుంది. సభను ఎన్ని రోజులపాటు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చ చేపట్టాలి? అనే విషయాలపై బీఏసీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఎమ్మెల్యేలు సభలో తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నప్పుడే హాజరు నమోదయ్యేలా రూపొందించిన నూతన సాంకేతిక విధానాన్ని ఈ సమావేశాల్లో మరోసారి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
వివరాలు
తొలిరోజు డీఎస్సీ-2025పై ప్రకటన
ప్రాథమికంగా ఖరారైన కార్యక్రమం ప్రకారం.. తొలిరోజు డీఎస్సీ-2025కు సంబంధించి మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేయనున్నారు.
అనంతరం సాగునీరు, తాగునీటి సరఫరా, వ్యవసాయ రంగాలపై ఎల్‌నినో ప్రభావానికి సంబంధించి లఘు చర్చ నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాసనాలు-2019 బిల్లును ఉపసంహరించడంతో పాటు పురపాలక చట్టంలో సవరణకు సంబంధించిన రెండు బిల్లులను ఆయా శాఖల మంత్రులు సభలో ప్రవేశపెట్టనున్నారు.
వివరాలు
బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ
ఈ నెల 18న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మంత్రిమండలి సమావేశం జరగనుంది.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికను మంత్రిమండలి ఆమోదించనుంది. అదే రోజు ఆ నివేదికపై శాసనసభలో చర్చ చేపట్టనున్నారు.
గ్రూప్-1 నియామకాలపై చర్చ
మూడో రోజు వైకాపా ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై చర్చ జరగనుంది.
అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలపైనా చర్చించనున్నారు.
నాలుగో రోజు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, సూపర్-6 పథకాల అమలుపై చర్చ చేపట్టే అవకాశం ఉంది.
మొత్తంగా ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆరు బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.