India vs China: చైనాకు చెక్.. హాకీ ప్రపంచకప్‌లో భారత్ అదిరే ఆరంభం
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల హకీ ప్రపంచకప్‌ను భారత్ ఆశాజనకంగా ఆరంభించింది. బలమైన చైనాతో జరిగిన పూల్-డి మ్యాచ్‌ను సలీమా బృందం 2-2తో డ్రాగా ముగించింది. పట్టుదలతో పోరాడిన భారత్.. ప్రత్యర్థికి ఏమాత్రం తలొగ్గకుండా మ్యాచ్‌ను సమం చేసుకుని పాయింట్ల ఖాతా తెరిచింది. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఎనిమిది మంది ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఇది మెరుగైన ఫలితంగా నిలిచింది. మ్యాచ్ తొలి 30 నిమిషాల్లో భారత్ ఎక్కువ శాతం ఆధిపత్యం ప్రదర్శించింది. 8వ నిమిషంలో నేహా అందించిన పాస్‌ను అందుకున్న నవ్‌నీత్ కౌర్ చక్కటి ఫినిషింగ్‌తో గోల్ చేసింది. ఆమె ఆడిన షాట్ కార్నర్ నుంచి నేరుగా గోల్‌లోకి వెళ్లడంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
వివరాలు
చైనాకు పెనాల్టీ స్ట్రోక్
అయితే తొలి క్వార్టర్ ముగియడానికి కొన్ని సెకన్ల ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
భారత గోల్‌కు సమీపంలో చైనా ఆటగాళ్లతో పోరాడుతున్న సమయంలో శిల్పి దాస్.. జాంగ్ జియాకిని పడగొట్టింది. దీంతో చైనాకు పెనాల్టీ స్ట్రోక్ లభించింది.
ఈ అవకాశాన్ని యింగ్ జాంగ్ 15వ నిమిషంలో గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేసింది. చైనా గోల్ చేసినా, శిల్పి ఐదు నిమిషాల పాటు సస్పెండ్ అయినా భారత్ వెనక్కి తగ్గలేదు.
దాడులను కొనసాగిస్తూ ఎక్కువ సమయం ప్రత్యర్థి గోల్ ప్రాంతంలోనే కనిపించింది. అయితే చివరి దశలో ఫినిషింగ్ లోపించడంతో మరిన్ని గోల్స్ రాలేదు.
వివరాలు
నాలుగు పెనాల్టీ కార్నర్లను సంపాదించిన చైనా
25వ నిమిషంలో దీపిక చైనా గోల్ ప్రాంతంలోకి దూసుకెళ్లి పెనాల్టీ కార్నర్‌ను సంపాదించింది. ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకుంది.
దీపికే గోల్ చేసి జట్టును 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత చైనా ఎదురుదాడులను తీవ్రం చేసింది. బల్జీత్ కౌర్ ఒక గోల్‌ను అడ్డుకోగా.. గోల్‌కీపర్ సవిత రెండు కీలక అవకాశాలను నిలువరించింది.
అయితే మూడో క్వార్టర్‌లో చైనా ప్రయత్నాలు ఫలించాయి. 39వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను మా నింగ్ గోల్‌గా మలిచి స్కోరును 2-2కు తీసుకొచ్చింది.
చివరి దశలో ఆధిక్యం కోసం చైనా తీవ్రంగా ప్రయత్నించింది. ఆ జట్టు ఆటగాళ్లు 13 సార్లు భారత గోల్ సమీపంలోకి చొచ్చుకొచ్చారు. నాలుగు పెనాల్టీ కార్నర్లను కూడా సంపాదించారు.
వివరాలు
పురుషుల హాకీ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా శుభారంభం
అయినప్పటికీ భారత డిఫెన్స్ పటిష్ఠంగా నిలిచింది. ప్రత్యర్థికి మరో గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.
మరో పూల్-డి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4-0తో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది.
డార్సీ 10వ నిమిషంలో, టెసా 13వ నిమిషంలో, ఎలిజబెత్ 30వ నిమిషంలో, సోఫీ హమిల్టన్ 41వ నిమిషంలో గోల్స్ చేసి ఇంగ్లాండ్ విజయాన్ని ఖాయం చేశారు. పూల్-సి మ్యాచ్‌లో బెల్జియం 3-2తో న్యూజిలాండ్‌ను ఓడించింది.
పురుషుల హాకీ ప్రపంచకప్‌లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా విజయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. పూల్-సి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 3-1తో ఓడించింది.
ఆస్ట్రేలియా తరఫున జోయెల్ 7వ, 23వ నిమిషాల్లో రెండు గోల్స్ చేయగా.. బ్లేక్ 27వ నిమిషంలో మరో గోల్ సాధించాడు.
వివరాలు
పాకిస్థాన్ తరఫున 51వ నిమిషంలో గోల్ కొట్టిన అఫ్రాజ్
ఐర్లాండ్ తరఫున అలిస్టర్ 54వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు. పూల్-బి పోరులో బెల్జియం 3-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది.
నీల్సన్ 18వ నిమిషంలో, రోమన్ 45వ నిమిషంలో, హెండ్రిక్స్ 57వ నిమిషంలో గోల్స్ చేశారు. ఫ్రాన్స్ తరఫున ఇలియట్ 4వ నిమిషంలో, ఫ్లోరెంట్ 19వ నిమిషంలో గోల్స్ సాధించారు. పూల్-డి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4-1తో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది.
రష్‌మెర్ 13వ నిమిషంలో, వార్డ్ 29వ నిమిషంలో, హూపర్ 32వ నిమిషంలో, జేమ్స్ 48వ నిమిషంలో ఇంగ్లాండ్ తరఫున గోల్స్ కొట్టారు.
పాకిస్థాన్ తరఫున అఫ్రాజ్ 51వ నిమిషంలో ఏకైక గోల్ సాధించాడు. పూల్-ఎ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 5-1తో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.