Flying Cars: 2028 నాటికి భారత్‌లో ఎగిరే కార్లు.. తొలుత వైద్య అవసరాలకు
ఈ వార్తాకథనం ఏంటి
మన దేశంలోనూ ఎగిరే కార్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. 2028 నాటికి భారత్‌లో తమ ఈవీటీఓఎల్(ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్) వాహనాలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు జపాన్‌కు చెందిన ఫ్లైయింగ్ కార్ల తయారీ సంస్థ స్కైడ్రైవ్ ఇంక్ వెల్లడించింది. తొలుత వైద్య రంగానికి సంబంధించిన లాజిస్టిక్స్ సేవల్లో వీటిని వినియోగించాలని సంస్థ ప్రణాళిక రూపొందించింది. అవయవాల రవాణాకు కీలకం అవయవ మార్పిడి సమయంలో వాటిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు సమయం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో వేగంగా అవయవాలను గమ్యస్థానానికి చేర్చేందుకు తమ ఈవీటీఓఎల్ వాహనాలను ఉపయోగించాలని స్కైడ్రైవ్ భావిస్తోంది. భారత్‌లో ఈ సేవలను ప్రారంభించేందుకు ఎయిరిండియా,సుజుకీతో ఇటీవలే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు,సీఈఓ తొమొహిరో తెలిపారు.
వివరాలు
రన్‌వే అవసరం ఉండదు
ఈవీటీఓఎల్ విమానాలు చిన్నపాటి విద్యుత్ వాహనాలు. వీటికి సాధారణ విమానాల మాదిరిగా రన్‌వే అవసరం ఉండదు.
నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలగడం వీటి ప్రత్యేకత. ఇప్పటికే ఈ వాహనాలపై పలు పరీక్షలు నిర్వహించినట్లు స్కైడ్రైవ్ తెలిపింది.
గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈవీటీఓఎల్‌లు 300కు పైగా విజయవంతమైన ప్రయాణాలు పూర్తి చేశాయని తొమొహిరో వెల్లడించారు. ప్రస్తుతం ఇవి సర్టిఫికేషన్ దశలో ఉన్నాయని తెలిపారు.
రెండేళ్లలో వాణిజ్య కార్యకలాపాలు
జపాన్‌తో పాటు భారత్‌లోనూ రెండేళ్లలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని స్కైడ్రైవ్ లక్ష్యంగా పెట్టుకుంది.
తొలుత వైద్యపరమైన అవసరాల కోసం వీటిని వినియోగించి, ఆ తర్వాత ప్రయాణికుల రవాణా కోసం ఎయిర్ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తోంది.
వివరాలు
భారత్‌లో తయారీకి ప్రణాళిక
జపాన్‌లో ఫ్లైయింగ్ కార్ల తయారీ కోసం స్కైడ్రైవ్, సుజుకీతో ఒప్పందం కుదుర్చుకుంది.
భవిష్యత్‌లో భారత్‌లోనూ ఈ వాహనాల తయారీ చేపట్టాలని సంస్థ యోచిస్తోంది.
భారత్‌లో తయారు చేసిన ఎగిరే కార్లను పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తున్నట్లు స్కైడ్రైవ్ తెలిపింది.
450 ప్రీఆర్డర్లు.. భారత్ నుంచే 50
స్కైడ్రైవ్ ఫ్లైయింగ్ కార్లకు ఇప్పటికే 450 ప్రీఆర్డర్లు వచ్చినట్లు తొమొహిరో వెల్లడించారు. వీటిలో 50 ప్రీఆర్డర్లు భారత్ నుంచే ఉన్నాయని తెలిపారు.
మొదటి దశలో వైద్య అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చి, అనంతరం ప్రయాణికులను తరలించే ఎయిర్ ట్యాక్సీ సేవలపై దృష్టి పెడతామని ఆయన వివరించారు.