LOADING...
Nirmala Sitharaman: ఇంధనం,ఎరువులు,విదేశీ మారక నిల్వలపై అప్రమత్తంగా ఉండాలి: నిర్మలా సీతారామన్
ఇంధనం,ఎరువులు,విదేశీ మారక నిల్వలపై అప్రమత్తంగా ఉండాలి: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman: ఇంధనం,ఎరువులు,విదేశీ మారక నిల్వలపై అప్రమత్తంగా ఉండాలి: నిర్మలా సీతారామన్

వ్రాసిన వారు Sirish Praharaju
May 25, 2026
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో దేశం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా చమురు, ఎరువులు, విదేశీ మారక నిల్వల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన పొదుపు చర్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని దేశ ఆర్థిక పరిస్థితిపై అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ముంబయిలో నిర్వహించిన సిడ్బీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధనం, ఎరువులు, బంగారం ధరలు భారీగా పెరిగినట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

వివరాలు 

పెట్రోల్‌,డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది:  నిర్మలా సీతారామన్

ఈ మూడు రంగాలకు సంబంధించిన దిగుమతుల చెల్లింపులు డాలర్ల రూపంలో చేయాల్సి వస్తోందని చెప్పారు. అందువల్ల విదేశీ మారక నిల్వలు తగ్గిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతోనే పెట్రోల్‌,డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిందని మంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి సుమారు లక్ష కోట్ల రూపాయల ఆదాయ నష్టం వస్తోందని వివరించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇంధనం, ఎరువులు, విదేశీ మారక నిల్వలు అనే మూడు కీలక అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రధాని మోదీ సూచనలు చేశారని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

వివరాలు 

భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది: నిర్మలా సీతారామన్

అయితే కొందరు దీనిని వక్రీకరించి దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతోందన్న భావన కల్పించేలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలను పట్టించుకోకుండా తప్పుడు ప్రచారాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులకు అంతర్జాతీయ కారణాలే ప్రధానమని గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజల్లో ధైర్యం నింపాల్సిన సమయంలో భయాందోళనలు సృష్టించడం సరికాదన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

Advertisement