Russia: ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారి.. రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు
ఈ వార్తాకథనం ఏంటి
జులై నెలలో రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు (Russian Crude Imports) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు మెరుగుపడడంతో పశ్చిమాసియా దేశాల నుంచి కూడా చమురు సరఫరా కొనసాగుతున్నప్పటికీ, రష్యా నుంచి దిగుమతులు మరింత పెరిగాయి. జులైలో భారత్ రోజుకు 2.8 మిలియన్ బ్యారెళ్ల (mbd) రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Ukraine War) ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో చమురు దిగుమతి చేసుకోవడం ఇదే తొలిసారి.
వివరాలు
మొత్తం దిగుమతులు 5 మిలియన్ బ్యారెళ్లకు పైగా
షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ వెల్లడించిన వివరాల ప్రకారం, జులైలో భారత్ ప్రపంచ దేశాల నుంచి రోజుకు 5 మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంది.
ఇది జూన్ నెలతో పోలిస్తే స్వల్పంగా అధికంగా ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతులు జూన్‌లో 2.7 మిలియన్ బ్యారెళ్లు ఉండగా, జులైలో అవి 2.8 మిలియన్ బ్యారెళ్లకు పెరిగాయి.
దీంతో భారత మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 55.5 శాతానికి చేరుకుంది.
దిగుమతులు పెరగడానికి రష్యా నుంచి చమురు నిరంతరాయంగా అందుబాటులో ఉండటమే ప్రధాన కారణమని కెప్లర్ ప్రధాన విశ్లేషకుడు నిఖిల్ దుబే తెలిపారు.
వివరాలు
ఎల్‌పీజీకి మాత్రం అమెరికాపైనే ఆధారం
ముడి చమురు విషయంలో రష్యాపై ఆధారపడుతున్నప్పటికీ ఎల్‌పీజీ దిగుమతుల విషయంలో భారత్ అమెరికా (USA) వైపే మొగ్గు చూపింది.
జులైలో దిగుమతి చేసుకున్న 1.2 మిలియన్ టన్నులకు పైగా ఎల్‌పీజీలో సుమారు 73 శాతం అమెరికా నుంచే కొనుగోలు చేసినట్లు నివేదిక వెల్లడించింది.
వివరాలు
పశ్చిమాసియా నుంచి కూడా పెరిగిన కొనుగోళ్లు
జులై నుంచి భారత రిఫైనరీలు పశ్చిమాసియా సరఫరాదారుల (West Asian Suppliers) నుంచి కూడా చమురు కొనుగోళ్లను పెంచినట్లు కెప్లర్ పేర్కొంది.
ఈ ప్రాంతంలో సౌదీ అరేబియా ప్రధాన సరఫరాదారుగా నిలిచింది. ఆ దేశం నుంచి జూన్‌లో రోజుకు 2.9 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోగా, జులైలో అది 4.2 లక్షల బ్యారెళ్లకు పెరిగింది.
అదేవిధంగా ఇరాక్, కువైట్ నుంచి కూడా చమురు దిగుమతులు తిరిగి ప్రారంభమయ్యాయి.
మరోవైపు యూఏఈ నుంచి దిగుమతులు జూన్‌లో రోజుకు 5.1 లక్షల బ్యారెళ్లు ఉండగా, జులైలో 4.6 లక్షల బ్యారెళ్లకు తగ్గాయి.
అయినప్పటికీ, భారత్‌కు రెండో అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా యూఏఈ కొనసాగుతోంది.