Dabur India: '100% నేచురల్' ప్రచారాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హెచ్చరిక.. డాబర్‌కు నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
'100 శాతం నేచురల్','100 శాతం ప్యూర్', '100 శాతం ఆర్గానిక్' వంటి ప్రకటనలతో ఆహార ఉత్పత్తులను విక్రయించడంపై భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) డాబర్ ఇండియాకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి క్లెయిమ్‌లతో విక్రయిస్తున్న ఉత్పత్తుల ప్రచారం, విక్రయాలను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఈ తరహా ప్రకటనలు స్పష్టమైన ఆధారాలు లేనివిగా కనిపిస్తున్నాయని,వాటిని నిర్ధారించడం సాధ్యం కాదని,వినియోగదారులు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పరిశీలనలో డాబర్ తేనె, యాపిల్ సైడర్ వెనిగర్, వర్జిన్ కొబ్బరి నూనె,నువ్వుల నూనె, ఆవు నెయ్యి,కొబ్బరి నీరు,కొబ్బరి పాలు వంటి పలు ఉత్పత్తులపై '100 శాతం' అనే క్లెయిమ్‌లను ఉపయోగించినట్లు గుర్తించింది.
వివరాలు
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్-2018 నిబంధనలకు విరుద్ధం
ఈ ప్రచారాలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్) రెగ్యులేషన్స్-2018 నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
అలాగే డాబర్ హిమాలయన్ ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్, డాబర్ ఆర్గానిక్ హనీ ఉత్పత్తులపై చెల్లుబాటు అయ్యే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆర్గానిక్ ధ్రువీకరణ లేకుండానే 'జైవిక్ భారత్' లోగోను వినియోగించినట్లు అధికారులు గుర్తించారు.
మరోవైపు డాబర్ హోమ్‌మేడ్ కొబ్బరి పాల ఉత్పత్తిపై '100 శాతం ప్యూరిటీ' అని పేర్కొనడం కూడా నిబంధనలకు అనుగుణంగా లేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది.
వివరాలు
15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచన
ఈ అంశాలపై గతంలోనే డాబర్‌కు నోటీసులు జారీ చేసి, ఇలాంటి క్లెయిమ్‌లను తొలగించాలని సూచించినప్పటికీ సంస్థ నుంచి తగిన చర్యలు కనిపించలేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది.
దీంతో నోటీసులో పేర్కొన్న ఉత్పత్తులతో పాటు '100 శాతం' అనే ప్రచార వాదనలు ఉన్న ఇతర ఆహార ఉత్పత్తుల విక్రయాలను కూడా తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అలాగే తీసుకున్న చర్యలపై 15 రోజులలోగా పూర్తి నివేదిక సమర్పించాలని డాబర్‌ను ఆదేశించింది.
ఇదిలా ఉండగా, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి నోటీసు అందిన విషయాన్ని డాబర్ ఇండియా ధృవీకరించింది.
నోటీసులో ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తున్నామని, సంబంధిత విషయాలపై అవసరమైన చర్యలు తీసుకుంటామని కంపెనీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.