Nitin Gadkari: ఈ20 వివాదానికి గడ్కరీ క్లారిటీ.. కుటుంబ వాటా 0.07 శాతమే
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇథనాల్ బ్లెండింగ్ విధానంపై వస్తున్న 'ఆసక్తుల ఘర్షణ' (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) ఆరోపణలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు. ఈ విధానం వల్ల తన కుటుంబానికి వ్యక్తిగతంగా లాభాలు చేకూరుతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఇవన్నీ పూర్తిగా రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్న ఆరోపణలేనని, తన ప్రతిష్టతో పాటు దేశ ప్రగతిని దెబ్బతీయాలనే కుట్రలో భాగమని పేర్కొన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ అంశాలపై గడ్కరీ విపులంగా స్పందించారు.
వివరాలు
కుటుంబ వాటా కేవలం 0.07 శాతమే
కాంగ్రెస్ పార్టీతో పాటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవని గడ్కరీ అన్నారు.
దేశంలో ఇథనాల్ విధానం అమల్లోకి రావడానికి చాలా కాలం ముందే తమ కుటుంబం చక్కెర పరిశ్రమలో ఉందని గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా సుమారు 550 యూనిట్లలో ప్రతి ఏడాది దాదాపు 1,500 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు.
ఇందులో తమ కుటుంబానికి, తన కుమారుల సంస్థలకు కలిపి ఉన్న వాటా కేవలం 0.07 శాతం మాత్రమేనని వెల్లడించారు.
ఇంత స్వల్ప భాగస్వామ్యం ఉన్న వ్యక్తి దేశవ్యాప్త విధానాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభావితం చేయడం ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని ప్రశ్నించారు.
వివరాలు
ఇది వ్యక్తిగత నిర్ణయం కాదు.. సమిష్టి విధానం
తన కుమారుల వ్యాపారంలో కూడా ఇథనాల్ వాటా కేవలం 10 శాతమేనని, ఆ సంస్థలపై ప్రస్తుతం రూ.1,600 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు.
ఇథనాల్ కొనుగోళ్లు, ధరల నిర్ణయం లేదా వ్యాపార నిర్వహణలో తనకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు.
ఇథనాల్ బ్లెండింగ్‌కు సంబంధించిన విధాన నిర్ణయాలు కేంద్ర పెట్రోలియం,సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయని గడ్కరీ వివరించారు.
తన మంత్రిత్వ శాఖ బాధ్యత వాహనాల ఇంజిన్ ప్రమాణాలను పర్యవేక్షించడం వరకే పరిమితమని చెప్పారు.
ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదని,కేంద్ర కేబినెట్, పెట్రోలియం మంత్రిత్వ శాఖ,శాస్త్రీయ సంస్థలు, నిపుణులతో విస్తృతంగా చర్చించిన తర్వాతే అమల్లోకి వచ్చిందని తెలిపారు.
వివరాలు
రైతుల ఆదాయం పెంపే ప్రధాన లక్ష్యం
ఈ విధానం వాజపేయి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైందని, అనంతరం యూపీఏ ప్రభుత్వం కూడా దీనిని కొనసాగించి మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.
ఇథనాల్ విధానం వెనుక ప్రధాన ఉద్దేశం రైతుల ఆదాయాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై దేశ ఆధారాన్ని తగ్గించడమేనని గడ్కరీ వివరించారు.
చెరకు మాత్రమే కాకుండా మొక్కజొన్న, వెదురు, వ్యవసాయ వ్యర్థాల నుంచి కూడా ఇథనాల్, మిథనాల్, హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
భవిష్యత్తులో దేశ ఇంధన అవసరాలకు ఇవి కీలకంగా మారుతాయని అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఈ20తో ఇంజిన్లు దెబ్బతినవు
20 శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన ఈ20 పెట్రోల్ వాడితే వాహనాల మైలేజీ తగ్గిపోతుందని, ఇంజిన్లు పాడవుతాయని జరుగుతున్న ప్రచారాన్ని గడ్కరీ పూర్తిగా ఖండించారు.
అలాంటి వాదనలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
అమెరికా, బ్రెజిల్, జర్మనీ, స్వీడన్ వంటి దేశాల్లో దశాబ్దాలుగా ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని విజయవంతంగా వినియోగిస్తున్నారని గుర్తు చేశారు.
ఈ20 వల్ల నిజంగా వాహనదారులకు నష్టం జరిగిందని ఎవరైనా నిరూపిస్తే, నేరుగా వాహన తయారీ సంస్థలకు లేదా తనకు ఫిర్యాదు చేయాలని గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
ఆయన ప్రకారం, ఈ20పై జరుగుతున్న ప్రతికూల ప్రచారంలో వాస్తవాల కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.