Loading...
Nitin Gadkari: ప్రైవేట్ బైక్ ట్యాక్సీలకు అనుమతివ్వండి.. రాష్ట్ర ప్రభుత్వాలకు గడ్కరీ విజ్ఞప్తి
ప్రైవేట్ బైక్ ట్యాక్సీలకు అనుమతివ్వండి.. రాష్ట్ర ప్రభుత్వాలకు గడ్కరీ విజ్ఞప్తి

Nitin Gadkari: ప్రైవేట్ బైక్ ట్యాక్సీలకు అనుమతివ్వండి.. రాష్ట్ర ప్రభుత్వాలకు గడ్కరీ విజ్ఞప్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రైవేట్ ద్విచక్ర వాహనాల యజమానులకు ఉపయోగపడే కీలక ప్రతిపాదన చేశారు. వ్యక్తిగత మోటార్‌సైకిళ్లను కూడా అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్యాసింజర్ బైక్‌ ట్యాక్సీలుగా నడిపేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025ను అమలు చేయాలని సూచించారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన 'రైడ్' కార్యక్రమంలో గడ్కరీ ఈ అంశంపై మాట్లాడారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల రవాణా కమిషనర్లతో దీనిపై చర్చించినట్లు వెల్లడించారు. తమ రాష్ట్రాల్లో ప్రైవేట్ బైక్‌ ట్యాక్సీలకు అనుమతి కల్పించే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కోరినట్లు తెలిపారు.

వివరాలు 

15 నుంచి 20 కోట్ల మందికి ఉపాధి!

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు కూడా రాసినట్లు చెప్పారు.

కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను ప్రస్తుతం రాజస్థాన్ మాత్రమే పూర్తిస్థాయిలో అమలు చేస్తోందని, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు పాక్షికంగా అమలు చేస్తున్నాయని వివరించారు.

ఈ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే భారీగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలో పేదరికం, నిరుద్యోగ సమస్యలు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎందుకు ముందుకు రాకూడదని ప్రశ్నించారు.

బైక్‌ ట్యాక్సీ సేవలకు దేశవ్యాప్తంగా అనుమతి ఇస్తే, డెలివరీ రంగాన్ని కూడా కలుపుకొని దాదాపు 15 నుంచి 20 కోట్ల మందికి జీవనోపాధి లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

వివరాలు 

రాష్ట్రాల నిర్ణయంపైనే భవిష్యత్తు

మోటారు వాహనాల చట్టం ప్రకారం వ్యక్తిగత ద్విచక్ర వాహనాలను షేర్డ్ ప్రయాణాలకు ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ విధానం అమల్లోకి వస్తే నగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతోపాటు వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని కూడా కొంతవరకు నియంత్రించవచ్చని భావిస్తున్నారు.

అంతేకాకుండా సామాన్యులకు తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం లభిస్తుంది.

ప్రస్తుతం రాపిడో,ఉబర్ వంటి సంస్థలు పలు రాష్ట్రాల్లో బైక్‌ ట్యాక్సీ సేవల నిర్వహణకు సంబంధించి నియంత్రణపరమైన అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి.

కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను రాష్ట్రాలు అమలు చేస్తే ఈ సంస్థల కార్యకలాపాలకు చట్టపరమైన స్పష్టత లభిస్తుంది.

అయితే ప్రైవేట్ బైక్‌లను ప్యాసింజర్ ట్యాక్సీలుగా అనుమతించాలా?వద్దా?అనే తుది నిర్ణయం తీసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది.

ADVERTISEMENT