Gautam Adani: నేడు కూడా కొనసాగుతున్న అదానీ సంస్థల షేర్ల పతనం.. ఒకశాతం పెరిగిన అంబుజా సిమెంట్స్ షేర్లు
భారత ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సహా మరికొందరిపై దాదాపు రూ. 2,000 కోట్ల అవినీతి ఆరోపణలు అమెరికా నుంచి వెలువడడంతో భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ ఆరోపణల ఫలితంగా మొదటి రోజు అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఒక్క రోజులోనే గ్రూప్ మార్కెట్ విలువ సుమారు రూ. 2.2 లక్షల కోట్ల మేర కోల్పోయింది. అమెరికా ఆరోపణల నేపథ్యంలో, కెన్యా ప్రభుత్వం అదానీ గ్రూప్‌తో కలిపిన విద్యుత్తు సరఫరా లైన్ల కాంట్రాక్ట్ మరియు జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయం కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తుందని ప్రకటించింది.
నాలుగు శాతం తగ్గిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు
ఈ పరిణామాల కారణంగా అదానీ గ్రూప్ షేర్ల పతనం రెండవ రోజు కూడా కొనసాగింది.అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు నాలుగు శాతం తగ్గాయి,ఇది గత ఏడాది మే తర్వాత షేర్ల విలువలో నమోదైన మొదటి పెద్ద తగ్గుదల. అదానీ పోర్ట్స్, టోటల్ గ్యాస్, గ్రీన్, పవర్, విల్‌మార్, ఎనర్జీ సొల్యూషన్స్ వంటి ఇతర షేర్లు కూడా 3 నుంచి 10 శాతం వరకు పడిపోయాయి. దీనికి విరుద్ధంగా, అదానీ గ్రూప్‌లోని ఏసీసీ సిమెంట్స్ షేర్లు 0.5 శాతం తగ్గగా, అంబుజా సిమెంట్స్ మరియు ఎన్డీటీవీ షేర్లు ఒక్కొక్కటి సుమారు 1 శాతం మేర పెరగడం విశేషం. ఈ సంఘటనలు మార్కెట్‌లో గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నప్పటికీ, కొంతమంది పెట్టుబడిదారుల విశ్వాసం మాత్రం కొనసాగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.