Loading...
FAO: 44 నెలల గరిష్ఠానికి ప్రపంచ ఆహార ధరలు.. ఎఫ్‌ఏఓ తాజా నివేదిక
44 నెలల గరిష్ఠానికి ప్రపంచ ఆహార ధరలు.. ఎఫ్‌ఏఓ తాజా నివేదిక

FAO: 44 నెలల గరిష్ఠానికి ప్రపంచ ఆహార ధరలు.. ఎఫ్‌ఏఓ తాజా నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2026
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు 44 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార,వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం జూలై నెలలో గ్లోబల్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ 131.1 పాయింట్లకు చేరుకుంది. జూన్‌లో ఇది 130.3 పాయింట్లుగా ఉండగా, తాజా పెరుగుదలతో 2023 జనవరి తర్వాత ఇదే అత్యధిక స్థాయిగా నమోదైంది. ప్రపంచ ఆహార ధరల పెరుగుదలకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు,గల్ఫ్‌,బ్లాక్‌సీ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలు ప్రధాన కారణాలుగా ఎఫ్‌ఏఓ పేర్కొంది. ఈ పరిణామాల ప్రభావంతో పంటల మార్కెట్లు ఒత్తిడికి గురవడంతో అంతర్జాతీయంగా ఆహార వస్తువుల ధరలు పెరిగినట్లు తెలిపింది.

వివరాలు 

గోధుమ, వంటనూనెల ధరలకు రెక్కలు

ధాన్యాల ధరలను సూచించే ఎఫ్‌ఏఓ సీరియల్ ప్రైస్ ఇండెక్స్ నెలవారీగా 3.4 శాతం పెరిగింది.

ముఖ్యంగా గోధుమ ధరలు ఒక్క నెలలోనే 5.8 శాతం ఎగబాకడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.

కూరగాయల నూనెల ధరలు కూడా పెరుగుదల బాట పట్టాయి. వెజిటబుల్ ఆయిల్ ఇండెక్స్ 2 శాతం పెరిగి 2022 జూన్ తర్వాత అత్యధిక స్థాయిని నమోదు చేసింది.

ముడి చమురు ధరల పెరుగుదలతో పాటు బయోడీజిల్‌కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా పామ్ ఆయిల్,సోయా ఆయిల్ ధరలు మరింత ఎగసిపడుతున్నాయని ఎఫ్‌ఏఓ వెల్లడించింది.

ప్రపంచ ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని ఎఫ్‌ఏఓ ప్రధాన ఆర్థికవేత్త హెచ్చరించారు.

వివరాలు 

యుద్ధాలు, ఎల్‌నినో ప్రభావం..పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం

ఇరాన్‌, ఉక్రెయిన్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలు, ఎల్‌నినో ప్రభావం కలిసి ఉత్పత్తి వ్యయాలను పెంచడంతో పాటు పంట దిగుబడులను తగ్గించే పరిస్థితి నెలకొంటోందని పేర్కొన్నారు.

బ్లాక్‌సీ ప్రాంతంలో ఎగుమతులకు అంతరాయం ఏర్పడటం, గోధుమ ఉత్పత్తి చేసే కీలక ప్రాంతాల్లో తీవ్ర వేడి ప్రభావం కూడా గోధుమ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

మరోవైపు యూరప్‌, ఆసియా దేశాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, బ్రెజిల్‌లో ఇథనాల్‌కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా చక్కెర ధరలు కూడా 5.6 శాతం పెరిగినట్లు ఎఫ్‌ఏఓ వెల్లడించింది.

ADVERTISEMENT