Loading...
GMR: ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల విస్తరణకు జీఎంఆర్ రూ.19,400 కోట్ల పెట్టుబడి
ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల విస్తరణకు జీఎంఆర్ రూ.19,400 కోట్ల పెట్టుబడి

GMR: ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల విస్తరణకు జీఎంఆర్ రూ.19,400 కోట్ల పెట్టుబడి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత విమానయాన రంగంలో ప్రముఖ సంస్థగా ఉన్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ కీలక ప్రకటన చేసింది. దిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల విస్తరణ, ఆధునీకరణ కోసం దాదాపు 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19,400 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో ఈ పెట్టుబడులను దశలవారీగా చేయనుంది. విమాన ప్రయాణానికి దేశంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విమానాశ్రయాల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మౌలిక వసతులను ఆధునీకరించడం ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్ కొనసాగుతోంది.

వివరాలు 

ప్రధానంగా హైదరాబాద్ విమానాశ్రయంపై భారీ పెట్టుబడి

జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీ) సౌరభ్ చావ్లా తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ కోసం సుమారు రూ.13,800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు.

అలాగే ఢిల్లీలోని విమానాశ్రయానికి రూ.5,600 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు.

ఆయా విమానాశ్రయాలను నిర్వహించే ప్రత్యేక సంస్థలు రుణం, ఈక్విటీ నిధుల కలయికతో ఈ పెట్టుబడులను సమకూర్చుకోనున్నాయి.

విస్తరణ పనులు పూర్తయిన తర్వాత హైదరాబాద్ విమానాశ్రయం ఏడాదికి సుమారు 8 కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించే స్థాయికి చేరుకోనుంది.

ప్రస్తుతం ఈ విమానాశ్రయం ఏడాదికి దాదాపు 3.4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. అంటే ప్రస్తుత సామర్థ్యంతో పోలిస్తే రెండింతలకు పైగా పెరగనుంది.

వివరాలు 

అదానీ గ్రూప్‌తో పోటీ

ఏడాదికి నిర్వహించే ప్రయాణికుల సంఖ్య ఆధారంగా చూస్తే భారత్‌లో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ అతిపెద్ద విమానాశ్రయ నిర్వాహక సంస్థగా ఉంది.

అయితే అత్యధిక సంఖ్యలో విమానాశ్రయాలు నిర్వహిస్తున్న సంస్థగా అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఉంది.

తన విమానాశ్రయాల సామర్థ్యాన్ని పెంచేందుకు వచ్చే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని అదానీ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల విస్తరణ జీఎంఆర్ చేపట్టనున్న ఆధునీకరణ కార్యక్రమానికి ఆరంభం మాత్రమే కావచ్చని సౌరభ్ చావ్లా తెలిపారు.

ప్రస్తుతం జీఎంఆర్ భారత్‌లో ఆరు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

దేశీయ విమానాశ్రయ ప్రాజెక్టులపై దృష్టి

ఫ్రాన్స్‌కు చెందిన ఏరోపోర్ట్స్ డి పారిస్ ఎస్‌ఏకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో 26.5 శాతం వాటా ఉంది.

దేశంలో ప్రభుత్వం విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న దేశీయ విమానాశ్రయ ప్రాజెక్టుల కోసం బిడ్లు దాఖలు చేయడంపై జీఎంఆర్ ప్రధానంగా దృష్టి పెట్టనుంది.

అయితే విదేశాల్లోని విమానాశ్రయాల పునరాభివృద్ధికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి చర్చలు జరగడం లేదని సంస్థ వెల్లడించింది.

విమానాశ్రయ నిర్వాహక సంస్థలు విమానయాన సంస్థలను కూడా నిర్వహించేందుకు వీలు కల్పించేలా విధాన మార్పుపై భారత్ పరిశీలన చేస్తున్నప్పటికీ.. ఎయిర్‌లైన్ వ్యాపారంలోకి ప్రవేశించే ఆలోచన తమకు లేదని సౌరభ్ చావ్లా స్పష్టం చేశారు.

విమానాశ్రయాల నిర్వహణ, వాటికి సంబంధించిన ఇతర కార్యకలాపాలపై దృష్టి సారించడమే జీఎంఆర్ గ్రూప్ లక్ష్యమని తెలిపారు.

ADVERTISEMENT