LOADING...
IBJA: బంగారంపై సుంకాల పెంపు.. డిమాండ్‌ 10% తగ్గే ఛాన్స్‌: ఐబీజేఏ
బంగారంపై సుంకాల పెంపు.. డిమాండ్‌ 10% తగ్గే ఛాన్స్‌: ఐబీజేఏ

IBJA: బంగారంపై సుంకాల పెంపు.. డిమాండ్‌ 10% తగ్గే ఛాన్స్‌: ఐబీజేఏ

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం బంగారం,వెండి సహా విలువైన లోహాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచడంతో దేశంలో బంగారం డిమాండ్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెల్లడించింది. మే 13 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త విధానం ప్రకారం దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. ఇందులో 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5 శాతం వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్ (AIDC) ఉన్నాయి. దీంతో జ్యువెలరీ వ్యాపారం 5 నుంచి 7 శాతం వరకు తగ్గొచ్చని ఐబీజేఏ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు.

వివరాలు 

బంగారం స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం

విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించడం, పెరుగుతున్న దిగుమతి బిల్లును నియంత్రించడం లక్ష్యంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం వల్ల అక్రమంగా బంగారం స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక దిగుమతి సుంకాల పెంపుతో దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి.

వివరాలు 

బంగారం కొనుగోలు బదులుగా గోల్డ్ లోన్ల వైపు మొగ్గు చూపే అవకాశం

జూన్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.1,62,700కి చేరగా, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ.2,97,013కు పెరిగాయి. అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉన్నా, దిగుమతి సుంకాల పెంపు ఒక్కటే దేశీయ ధరలను పెంచుతుందని నిపుణులు అంటున్నారు. అయితే ధరలు భారీగా పెరగడంతో కొనుగోలు తగ్గే అవకాశం ఉండటంతో పాటు, ప్రజలు బంగారం కొనుగోలు బదులుగా గోల్డ్ లోన్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం.. దిగుమతి సుంకాన్ని ప్రతి 1 శాతం పెంచితే దేశంలో బంగారం వినియోగ డిమాండ్‌ సుమారు 6.4 టన్నుల వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement