
Gold imports: మార్చిలో 192 % పెరిగి 4.47 బిలియన్ డాలర్లకు చేరుకున్న పసిడి దిగుమతులు!
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు పెరిగిపోయినా, ప్రజల్లో దీని పట్ల ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు.
ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, బంగారంపై మోజు తగ్గకపోవడం వల్ల దేశంలో బంగారం దిగుమతులు గణనీయంగా పెరిగాయి.
తాజాగా విడుదలైన మార్చి నెల గణాంకాలను వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.
గత నెలతో పోలిస్తే బంగారం దిగుమతుల విలువ ఏకంగా 191.13 శాతం పెరిగి 4.47 బిలియన్ డాలర్లకు చేరినట్లు పేర్కొంది.
ఇది భారత రూపాయలతో చూస్తే సుమారు రూ.38 వేల కోట్లకు సమానం. దిగుమతులు ఈ స్థాయిలో పెరగడం వలన ద్రవ్యలోటు కూడా తగినంతగా పెరుగుతోంది.
వివరాలు
బంగారం దిగుమతుల్లో 27.27 శాతం పెరుగుదల నమోదు
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి మార్చి వరకు భారత్ దాదాపు 58 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది.
గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో ఈ మొత్తం 45.54 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది.
ఈ నేపథ్యంలో చూస్తే బంగారం దిగుమతుల్లో 27.27 శాతం పెరుగుదల నమోదైంది.
ఈ గణాంకాలు బంగారంపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత, బ్యాంకుల నుంచి పెరుగుతున్న డిమాండ్, అలాగే బంగారం ధరల పెరుగుదల వలన దిగుమతుల విలువ పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.98,000 పైగా ఉంది.
వివరాలు
వెండి దిగుమతులు 11.24 శాతం మేర తగ్గాయి
ఈ ధరల పెరుగుదలకి ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు అనుసరిస్తున్న వాణిజ్య విధానాలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు వెండి దిగుమతులు మాత్రం భారీగా తగ్గాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం, వెండి దిగుమతులు 85 శాతం క్షీణించి 119.3 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
మొత్తం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వెండి దిగుమతులు 11.24 శాతం మేర తగ్గినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
భారతదేశం దిగుమతి చేసుకునే బంగారంలో అత్యధికంగా 40 శాతం వాటాతో స్విట్జర్లాండ్ ముందుంది.
దానిని అనుసరించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
వివరాలు
ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం దిగుమతిదారిగా భారత్
మొత్తం బంగారం దిగుమతుల్లో ఈ మూడు దేశాల కలిపిన వాటా సుమారు 66 శాతంగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం,మొత్తం దిగుమతులలో బంగారం వాటా 8 శాతం.
బంగారం దిగుమతులను టన్నుల ప్రకారం చూస్తే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 795.32 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా, 2024-25లో ఈ సంఖ్య 757.15 టన్నులకు తగ్గింది.
ఫిబ్రవరిలో బంగారం దిగుమతులు 62 శాతం మేర తగ్గగా,జనవరిలో 40.8 శాతం,డిసెంబర్ 2024లో 55.39 శాతం మేర పెరిగినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ప్రస్తుతం చైనాకు తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం దిగుమతిదారిగా భారత్ నిలిచింది.
ముఖ్యంగా భారతదేశంలో జువెలరీ పరిశ్రమ నుంచి వచ్చే గణనీయమైన డిమాండ్ కారణంగా బంగారం దిగుమతులు కొనసాగుతున్నాయి.