Gold rates: భారత్'లో బంగారం ధరలు YTD 66%పెరిగాయి,వెండి ధర 85% పెరిగింది:2025 లో వైట్ మెటల్ కిలోకు ₹2లక్షలకు చేరుకుంటుందా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత మార్కెట్‌లో బంగారం,వెండికి ఈ ఏడాది అరుదైన ర్యాలీ కనిపిస్తోంది. 2025 ప్రారంభం నుంచి ఇప్పటివరకు బంగారం ధరలు ఏకంగా 66 శాతం పెరిగితే,వెండి ధరలు 85 శాతం పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలు, డాలర్ బలహీనత, రూపాయి పతనం కలిసి లోహాల ధరలను భారీగా పెంచాయి. మంగళవారం MCXలో లాభాల స్వీకరణ కారణంగా స్వల్ప తగ్గుదల కనిపించగా, బంగారం 10 గ్రాములకు ₹1,30,109కి, వెండి కేజీకి ₹1,80,701కి ట్రేడయ్యాయి. ప్రపంచ మార్కెట్‌లో కూడా డాలర్ ఇండెక్స్ 99.43కి తగ్గడం బంగారం,వెండికి మద్దతిచ్చింది.
వివరాలు
గత మూడు నెలల్లో 40 శాతానికి పైగా దూసుకెళ్లిన వెండి
గత మూడు నెలల్లో బంగారం సుమారు 25 శాతం పెరిగితే,వెండి మాత్రం 40 శాతానికి పైగా దూసుకెళ్లి రికార్డు స్థాయిలను పరీక్షిస్తోంది. సౌర విద్యుత్ ప్యానెల్స్,ఎలక్ట్రానిక్స్,ఈవీలు, ఔషధ రంగాల్లో భారీ డిమాండ్, అంతర్జాతీయ గోదాముల్లో నిల్వలు తగ్గిపోవడం వెండిని మరింత బలపరుస్తున్నాయి. SS WealthStreet వ్యవస్థాపకురాలు సుగంధా సచ్‌దేవా వెండి గట్టిగా ముందుకు సాగుతోందని, అంతర్జాతీయంగా ఔన్సుకు 56 డాలర్లను దాటిందని చెప్పారు.
వివరాలు
2025లో వెండి కేజీకి ₹2 లక్షల మార్కును దాటుతుందా?
బ్రోకరేజ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ అంచనాల ప్రకారం అంతర్జాతీయంగా వెండి ఔన్సుకు 75 డాలర్ల వరకు చేరవచ్చని, భారత్‌లో కేజీకి ₹2.3 లక్షల వరకూ ధర పెరగొచ్చని భావిస్తోంది. సాంకేతికంగా కూడా వెండి బలమైన అప్ట్రెండ్‌లో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం MCXలో వెండికి కేజీకి ₹2 లక్షలు కీలక మానసిక స్థాయిగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ధరలు స్వల్పంగా తగ్గినప్పుడు కొనుగోలు చేసే విధానాన్ని పెట్టుబడిదారులు అనుసరించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2025లో వెండి నిజంగానే కేజీకి ₹2 లక్షల మార్కును దాటుతుందా అన్న ప్రశ్నకు మార్కెట్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.