Gold down 25%: 2026లో 25 శాతం పడిపోయిన బంగారం ధరలు.. గత చరిత్ర ఏం చెబుతోంది?
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కొత్తేమీ కాదు. గతంలోనూ పసిడి ధరలు పలుమార్లు రెండంకెల స్థాయిలో పడిపోయాయి. అయితే ఇలాంటి భారీ పతనాల తర్వాత బంగారం ధరలు ఎలా కోలుకున్నాయి? చరిత్ర ఏం చెబుతోంది? అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫండ్స్‌ఇండియా రీసెర్చ్ (FundsIndia Research) నివేదిక ప్రకారం.. 2026 అక్టోబర్ 31 నాటికి ఈ ఏడాదిలో బంగారం ధరలు గరిష్ఠ స్థాయి నుంచి ఏకంగా 25 శాతం పడిపోయాయి. 1980 నుంచి పరిశీలిస్తే ఇదే అత్యంత భారీ పతనాల్లో ఒకటిగా నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు బంగారం ధరల్లో ఏడాదిలో సగటున దాదాపు 13 శాతం మేర పతనం నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
వివరాలు
గతంలోనూ భారీగా తగ్గిన బంగారం ధరలు
ఒక ఏడాదిలో బంగారం ధరలు గరిష్ఠ స్థాయి నుంచి కనిష్ఠ స్థాయికి పడిపోయిన తేడాను ఇంట్రా ఇయర్ డిక్లైన్ లేదా డ్రాడౌన్ అంటారు.
గత గణాంకాలను పరిశీలిస్తే బంగారం ధరల్లో 10 నుంచి 15 శాతం వరకు తగ్గుదల సాధారణంగానే కనిపిస్తోంది.
ఉదాహరణకు 2020లో బంగారం ధరలు ఒక దశలో 15 శాతం వరకు పడిపోయాయి. 2022లోనూ ఇదే తరహా తగ్గుదల నమోదైంది.
2023లో సుమారు 10 శాతం మేర ధరలు తగ్గాయి. అయితే 2026లో నమోదైన 25 శాతం పతనం మాత్రం గతంతో పోలిస్తే తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
వివరాలు
భారీ పతనం తర్వాత కోలుకున్న బంగారం
ఈ నివేదికలో పరిశీలించిన కాలంలో అత్యధికంగా 1980లో బంగారం ధరలు గరిష్ఠ స్థాయి నుంచి 40 శాతం వరకు పడిపోయాయి.
అయితే ఇలాంటి భారీ పతనాలు నమోదైనప్పటికీ.. గత కొన్ని దశాబ్దాల్లో సుమారు 78 శాతం సందర్భాల్లో బంగారం ఏడాది చివరికి సానుకూల రాబడులను అందించింది.
ఉదాహరణకు 1980లో ఒక దశలో 40 శాతం తగ్గిన బంగారం ధరలు.. ఆ ఏడాది ముగిసే సమయానికి 4 శాతం లాభాన్ని నమోదు చేశాయి.
అలాగే 2020లో ఒక దశలో 15 శాతం వరకు తగ్గినప్పటికీ.. ఏడాది చివరికి ఏకంగా 28 శాతం రాబడిని అందించింది.
వివరాలు
పతనం నుంచి కోలుకోని సందర్భాలూ ఉన్నాయి
అయితే ప్రతిసారీ బంగారం ధరలు పతనం తర్వాత కోలుకుంటాయని భావించకూడదు.
దీనికి గతంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 1981లో బంగారం ధరలు ఒక దశలో 25 శాతం పడిపోగా.. ఆ ఏడాది చివరికి 22 శాతం నష్టంతో ముగిశాయి.
అలాగే 2013లోనూ బంగారం ధరలు 24 శాతం మేర తగ్గాయి. దీంతో ఆ ఏడాది చివరికి 18 శాతం నష్టాన్ని నమోదు చేశాయి.
ఇక 2026 అక్టోబర్ 31 నాటికి ఈ ఏడాది బంగారం పెట్టుబడులపై సుమారు 5 శాతం ప్రతికూల రాబడి నమోదైనట్లు ఫండ్స్‌ఇండియా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
వివరాలు
పెట్టుబడిదారులు ఏం చేయాలి?
బంగారం ధరలు గరిష్ఠ స్థాయి నుంచి భారీగా పడిపోయినంత మాత్రాన.. ఆ ఏడాది మొత్తం పెట్టుబడిపై నష్టాలు వస్తాయని చెప్పలేం.
గతంలో పలుమార్లు భారీగా పడిపోయిన తర్వాత బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అయితే ఈసారి కూడా అలాగే జరుగుతుందని కచ్చితంగా చెప్పలేం.
కాబట్టి పెట్టుబడిదారులు తమ పెట్టుబడి లక్ష్యం, ఎంతకాలం కొనసాగించాలనుకుంటున్నారు, ఇప్పటికే తమ దగ్గర ఎంత బంగారం ఉంది వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ధరలు భారీగా తగ్గిన తర్వాత కొనుగోలు చేసేవారు వెంటనే లాభాలు వస్తాయని ఆశించకుండా.. మరికొంతకాలం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.