LOADING...
Gold: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. రెండు నెలల కనిష్టానికి బంగారం ధరలు
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. రెండు నెలల కనిష్టానికి బంగారం ధరలు

Gold: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. రెండు నెలల కనిష్టానికి బంగారం ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2026
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. శాంతి చర్చలు సఫలం అవుతాయన్న ఆశలు తగ్గిపోవడం, ద్రవ్యోల్బణ భయాలు పెరగడం వల్ల ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. దీంతో బంగారం ధర రెండు నెలల కనిష్టానికి చేరుకుంది. ఔన్స్‌కు దాదాపు 2 శాతం పడిపోయి 4,365 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

వివరాలు 

హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు

హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా సైన్యం దాడులు జరిపినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. దీనికి ప్రతిగా దాడి చేసిన అమెరికా స్థావరాన్నే లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. మరోవైపు కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు క్షిపణులు, డ్రోన్ల ముప్పును ఎదుర్కొంటున్నట్లు తెలిపాయి. దీంతో మధ్యప్రాచ్య యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వివరాలు 

ట్రంప్ వ్యాఖ్యలతో చర్చలపై అనిశ్చితి

ఇరాన్‌తో జరుగుతున్న చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో శాంతి ఒప్పందంపై ఉన్న అనిశ్చితి నెలకొంది. హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకాయాన భద్రతపై అమెరికా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. ఈ మార్గం ప్రపంచ చమురు రవాణాకు కీలకం కావడంతో ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణ భయం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 98డాలర్లకు చేరువైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు కూడా తగ్గిపోయాయి. శాంతి ఒప్పందం జరిగినా కూడా చమురు ధరలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

వివరాలు 

బంగారంపై తగ్గుతున్న పెట్టుబడిదారుల ఆసక్తి

అధిక వడ్డీ రేట్ల పరిస్థితుల్లో బంగారం పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే బంగారంపై వడ్డీ రాబడి ఉండదు. మరోవైపు డాలర్ బలపడడంతో ఇతర దేశాల కొనుగోలుదారులకు బంగారం మరింత ఖరీదవుతోంది. ఫిబ్రవరి చివర్లో ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు 17 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. మార్కెట్ నిపుణుల అంచనా ఇదే ఇక బంగారం ధరలపై పెట్టుబడిదారుల నమ్మకం తగ్గుతోందని గ్లోబల్ ఎక్స్ ఈటీఎఫ్స్ ఆస్ట్రేలియా ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ జస్టిన్ లిన్ తెలిపారు. చమురు ధరలు ఇంకా పెరిగితే బంగారం 4,000 నుంచి 4,250 డాలర్ల మధ్య మద్దతు స్థాయికి చేరే అవకాశం ఉందన్నారు.

Advertisement