Loading...
Gold Spot: 26 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తున్న గోల్డ్‌ స్పాట్‌.. వచ్చే వారమే రీలాంచ్‌!
26 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తున్న గోల్డ్‌ స్పాట్‌.. వచ్చే వారమే రీలాంచ్‌!

Gold Spot: 26 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తున్న గోల్డ్‌ స్పాట్‌.. వచ్చే వారమే రీలాంచ్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు భారతీయ కూల్‌డ్రింక్‌ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గోల్డ్‌ స్పాట్‌ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు 26 ఏళ్ల క్రితం మార్కెట్‌ నుంచి కనుమరుగైన ఈ శీతల పానీయం వచ్చే వారం నుంచే తిరిగి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మారుతున్న వినియోగదారుల అభిరుచులు, ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ నేపథ్యంలో కోకకోలా ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో హెల్తీ, షుగర్‌-ఫ్రీ పానీయాలకు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో గోల్డ్‌ స్పాట్‌ను తక్కువ చక్కెర లేదా జీరో షుగర్‌ విభాగంలో తిరిగి ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

వివరాలు 

పానీయానికి మంచి ఆదరణ

1980వ దశకంలో 'ది జింగ్‌ థింగ్‌' అనే ట్యాగ్‌లైన్‌తో గోల్డ్‌ స్పాట్‌ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా అప్పటి తరం ప్రజల్లో ఈ పానీయానికి మంచి ఆదరణ ఉండేది.

ఇప్పుడు పాత బ్రాండ్‌ను కొత్త రూపంలో మార్కెట్‌లోకి తీసుకురావడానికి కోకకోలా సిద్ధమైంది.

ఈసారి బాటిళ్లకు బదులుగా క్యాన్‌ల రూపంలో గోల్డ్‌ స్పాట్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీ, ఆయన భార్య సాక్షి గోల్డ్‌ స్పాట్‌ క్యాన్‌లను పట్టుకున్న ఫొటోలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

వివరాలు 

1993లో కోకకోలా చేతికి.. 2000లో నిలిచిపోయిన విక్రయాలు

గోల్డ్‌ స్పాట్‌ చరిత్రలో 1993 కీలక మలుపుగా నిలిచింది.

ఆ ఏడాది పార్లే బిస్లరీ అధినేత రమేష్‌ చౌహాన్‌ నుంచి థమ్స్‌ అప్‌, లిమ్కా, మజా, గోల్డ్‌ స్పాట్‌ బ్రాండ్లను కోకకోలా కొనుగోలు చేసింది.

అనంతరం అంతర్జాతీయంగా తమ ఆరెంజ్‌ ఫ్లేవర్‌ బ్రాండ్‌ ఫాంటాను మరింత విస్తరించడంపై కంపెనీ దృష్టి పెట్టింది.

ఈ వ్యూహంలో భాగంగా 2000 సంవత్సరంలో గోల్డ్‌ స్పాట్‌ విక్రయాలను పూర్తిగా నిలిపివేసింది.

ADVERTISEMENT

వివరాలు 

1993లో కోకకోలా చేతికి.. 2000లో నిలిచిపోయిన విక్రయాలు

ఇప్పుడు మళ్లీ గోల్డ్‌ స్పాట్‌ను తీసుకొస్తున్నప్పటికీ, ఫాంటా విక్రయాలపై ప్రభావం పడకుండా కోకకోలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అందుకే గోల్డ్‌ స్పాట్‌ను సాధారణ ఆరెంజ్‌ కూల్‌డ్రింక్‌గా కాకుండా ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తక్కువ చక్కెర లేదా చక్కెర లేని పానీయంగా మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.

పాత తరం వినియోగదారులకు మధుర జ్ఞాపకాలను గుర్తుచేస్తూనే, కొత్త తరం వారిని కూడా ఆకట్టుకోవడమే ఈ రీలాంచ్‌ వెనుక ఉద్దేశంగా కనిపిస్తోంది.

ADVERTISEMENT