LOADING...
Goldman Sachs: FY27లో భారత్ వృద్ధిరేటు 6.5%, ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం.. గోల్డ్‌మన్ సాక్స్ అంచనా..
గోల్డ్‌మన్ సాక్స్ అంచనా..

Goldman Sachs: FY27లో భారత్ వృద్ధిరేటు 6.5%, ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం.. గోల్డ్‌మన్ సాక్స్ అంచనా..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2026
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడంతో భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం కనిపిస్తోందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మ్యాన్ సాచ్స్ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి (FY27) భారత వృద్ధిరేటు అంచనాను 6.1 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది. అలాగే ద్రవ్యోల్బణం కూడా గత అంచనాల కంటే తక్కువ స్థాయిలో ఉండే అవకాశముందని తెలిపింది. ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా హర్ముజ్ జలసంధి మూతపడే పరిస్థితి ఏర్పడటంతో గతంలో వృద్ధిరేటు అంచనాను తగ్గించింది. అయితే అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత పరిస్థితులు మెరుగుపడటంతో తాజా అంచనాలను సవరించింది.

వివరాలు 

ఇంధన దిగుమతుల్లో 60 శాతానికి పైగా హర్ముజ్ జలసంధిపైనే భారత్ ఆధారం 

"అమెరికా-ఇరాన్ ఒప్పందం తర్వాత మెరుగైన స్థూల ఆర్థిక పరిస్థితులు" పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. భారత్ మొత్తం విదేశీ వాణిజ్యంలో దాదాపు ఐదో వంతు, ఇంధన దిగుమతుల్లో 60 శాతానికి పైగా హర్ముజ్ జలసంధిపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల అక్కడి పరిస్థితులు భారత ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతాయని నివేదిక పేర్కొంది. కొన్ని నెలల పాటు భారత క్రూడ్ ఆయిల్ బాస్కెట్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగగా, జూన్‌లో అది 86.31 డాలర్లకు తగ్గింది. జూన్ 24 నాటికి బ్యారెల్ ధర 70.71 డాలర్లకు చేరిందని తెలిపింది.

వివరాలు 

4.9 శాతానికి తగ్గిన ద్రవ్యోల్బణం 

చమురు ధరల అంచనాలను కూడా తగ్గించిన నేపథ్యంలో 2026 క్యాలెండర్ సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు అంచనాను 6.8 శాతానికి పెంచినట్లు గోల్డ్‌మన్ సాక్స్ వెల్లడించింది. కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా భారత ఆర్థిక వృద్ధిరేటు 7 శాతం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని సంస్థ అభిప్రాయపడింది. గతంలో వినియోగం, పెట్టుబడులు పెరగడంతో ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ద్రవ్యోల్బణం విషయంలో కూడా గోల్డ్‌మన్ సాక్స్ సానుకూల అంచనాలను వెల్లడించింది. గతంలో 5.1 శాతంగా అంచనా వేసిన ద్రవ్యోల్బణాన్ని ఇప్పుడు 4.9 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు గణనీయంగా తగ్గడం వల్ల ఎరువుల సబ్సిడీ భారం తగ్గే అవకాశముందని పేర్కొంది.

Advertisement

వివరాలు 

వాతావరణ పరిస్థితులు డిమాండ్‌పై ప్రభావం చూపే అవకాశం

అలాగే చమురు ధరలు తగ్గడం వల్ల ప్రభుత్వ ఆర్థిక ఒత్తిడి కూడా కొంత వరకు తగ్గుతుందని తెలిపింది. అయితే సమీప కాలంలో వాతావరణ పరిస్థితులు డిమాండ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసిన వేడి గాలుల ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో వినియోగాన్ని దెబ్బతీయవచ్చని తెలిపింది. అయితే మూడో త్రైమాసికం తర్వాత వినియోగంపై అదనపు ప్రతికూల ప్రభావం ఉండదని, ఇంధన ధరలను మరింత పెంచాల్సిన అవసరం కనిపించడం లేదని పేర్కొంది.

Advertisement

వివరాలు 

RBI 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచే అవకాశం 

అలాగే 2026లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రెండు విడతల్లో మొత్తం 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచే అవకాశాన్ని గోల్డ్‌మ్యాన్ సాచ్స్ కొనసాగించింది. అయితే పాలిమర్, పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు మరింత తగ్గితే తయారీ సంస్థలపై ధరలు పెంచాల్సిన ఒత్తిడి తగ్గుతుందని, అలాంటి పరిస్థితుల్లో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపును వాయిదా వేసే అవకాశం కూడా ఉందని నివేదిక పేర్కొంది.

Advertisement