LOADING...
Aadhaar app: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్..మొబైల్ యాప్‌లో ఈ సేవ 6 నెలలు ఉచితం!
ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్..మొబైల్ యాప్‌లో ఈ సేవ 6 నెలలు ఉచితం!

Aadhaar app: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్..మొబైల్ యాప్‌లో ఈ సేవ 6 నెలలు ఉచితం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2026
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆధార్ కార్డుదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) శుభవార్త చెప్పింది. ఆధార్‌కు అనుసంధానించిన ఇ-మెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ, ప్రస్తుతం వసూలు చేస్తున్న రుసుములను తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రస్తుతం ఆధార్‌లో ఇ-మెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకోవడానికి రూ.75 ఫీజు చెల్లించాల్సి ఉండగా, జులై 1, 2026 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు ఆరు నెలలపాటు ఈ సేవను పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు UIDAI ప్రకటించింది. ఇ-మెయిల్ ఐడీని ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం ద్వారా ఆధార్‌కు సంబంధించిన కీలక సమాచారం, నోటిఫికేషన్లు మరియు ఇతర సేవల వివరాలను ఎప్పటికప్పుడు పొందే అవకాశం ఉంటుంది.

వివరాలు

ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఉచిత సేవ

ఆధార్ సేవలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో UIDAI ఇటీవల ఆధార్ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా పలు సేవలను పొందవచ్చు. ప్రస్తుతం యాప్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్, అడ్రస్ అప్‌డేట్, బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్, ఆధార్ వివరాల సెలెక్టివ్ షేరింగ్, అథెంటికేషన్ హిస్టరీ పరిశీలన, ఇ-ఆధార్ డౌన్‌లోడ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

వివరాలు

ఎక్కువ మంది ఇ-మెయిల్ లింక్ చేసుకునేలా ప్రోత్సాహం

ఆధార్ నంబర్‌కు ఇ-మెయిల్ ఐడీని అనుసంధానం చేసుకునే వారి సంఖ్యను పెంచేందుకు ప్రోత్సాహక చర్యగా ఈ ఏడాది చివరి వరకు మొబైల్ యాప్ ద్వారా ఇ-మెయిల్ అప్‌డేట్ సేవను ఉచితంగా అందించాలని UIDAI నిర్ణయించింది. డిసెంబర్ 31 తర్వాత ఈ సేవపై రుసుములు కొనసాగించాలా లేదా అన్న అంశాన్ని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఉచిత సదుపాయం కేవలం UIDAI అధికారిక మొబైల్ యాప్ ద్వారా ఇ-మెయిల్ అప్‌డేట్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. మొబైల్ యాప్ కాకుండా ఇతర మార్గాల ద్వారా ఇ-మెయిల్ అప్‌డేట్ చేస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న రుసుములు యథావిధిగా వర్తిస్తాయని UIDAI స్పష్టం చేసింది.

Advertisement