LOADING...
Banks Cut Lending Rates: బ్యాంకుల నుంచి శుభవార్త.. రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు ప్రధాన బ్యాంకులు..
రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు ప్రధాన బ్యాంకులు..

Banks Cut Lending Rates: బ్యాంకుల నుంచి శుభవార్త.. రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు ప్రధాన బ్యాంకులు..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 08, 2025
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక నిర్ణయం తీసుకుని రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో వడ్డీ రేట్లు మరింత చౌకగా మారి, వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వినియోగదారులకు ఊరట లభించనుంది. ఈ నిర్ణయ ప్రభావం ఇప్పటికే మొదలైందని తెలుస్తోంది. ఆర్బీఐ ప్రకటన వెలువడిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ఐదు ప్రధాన బ్యాంకులు తమ రుణ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో హోమ్ లోన్లు, కార్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు తదితర రిటైల్ రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది.

వివరాలు 

50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.50 శాతానికి

తాజా తగ్గింపుతో రెపో రేటు 5.25 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్య పరిధి కంటే తక్కువగా కొనసాగుతుండటంతో,రేట్ల కోత ముందే అంచనాగా భావించారు. 2025 సంవత్సరం మొత్తం మీద ఇప్పటివరకు నాలుగు దఫాలు రెపో రేటు తగ్గింపు జరగ్గా,మొత్తం కోత 1.25 శాతంగా నమోదైంది. ఫిబ్రవరి 2025లో 6.50 శాతం నుంచి 6.25 శాతానికి 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఐదేళ్ల తర్వాత మొదటిసారి రేట్ల కోతకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఏప్రిల్ సమావేశంలో మరోసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రెపో రేటు 6 శాతానికి చేరింది. జూన్‌లో మూడో వరుస కోతగా ఈసారి రెట్టింపు స్థాయిలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.50 శాతానికి తీసుకువచ్చారు.

వివరాలు 

 ప్రముఖ బ్యాంకులు కస్టమర్లకు శుభవార్త 

ఇక సంవత్సరం చివరి నెలలో మళ్లీ 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ తాజా నిర్ణయం తీసుకున్నారు. రెపో రేటు తగ్గింపుతో వెంటనే కొన్ని ప్రముఖ బ్యాంకులు తమ కస్టమర్లకు శుభవార్త వినిపించాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రెపో లింక్డ్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (RBLR)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.35 శాతం నుంచి 8.10 శాతానికి తీసుకువచ్చింది. ఈ కొత్త రేట్లు డిసెంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చాయి. అలాగే ఇండియన్ బ్యాంక్ తన RBLRను 8.20 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గించడంతో పాటు, MCLRను కూడా 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ మార్పులు డిసెంబర్ 6 నుంచి అమలవుతాయి.

Advertisement

వివరాలు 

 కొత్త రేట్లు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి.. 

బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా రుణ వడ్డీ రేట్లను తగ్గిస్తూ స్పందించింది. రెపో ఆధారిత రుణ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.15 శాతం నుంచి 7.90 శాతానికి తీసుకువచ్చింది. ఈ కొత్త రేట్లు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. మరోవైపు, ప్రైవేట్ రంగానికి చెందిన కరూర్ వైశ్యా బ్యాంక్ తన అన్ని కాలపరిమితి గల MCLRను 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ 9.55 శాతం నుంచి 9.45 శాతానికి తీసుకువచ్చింది. ఈ సవరించిన రేట్లు డిసెంబర్ 7 నుంచి అమలులోకి వస్తాయి. ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement

వివరాలు 

రుణగ్రహీతలకు మరింత తగ్గనున్న వడ్డీ భారం

గృహ రుణాలు, కార్ రుణాలు, విద్యా రుణాలు సహా రెపో-లింక్డ్ రుణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. డిసెంబర్ 6 నుంచి అమల్లోకి వచ్చే ఈ మార్పులతో గృహ రుణాలు 7.10 శాతం నుంచి, కార్ రుణాలు 7.45 శాతం నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. దీంతో రుణగ్రహీతలకు వడ్డీ భారం మరింత తగ్గనుంది.

Advertisement