PhonePe: పెట్టుబడిదారులకు గుడ్‌న్యూస్.. ఫోన్‌పే ఇన్వెస్ట్‌లో కొత్త ఫీచర్!
ఈ వార్తాకథనం ఏంటి
ఫోన్‌పే తన పెట్టుబడుల వేదిక షేర్.మార్కెట్ పేరును ఫోన్‌పే ఇన్వెస్ట్‌గా మార్చింది. దీనితో పాటు పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోను విశ్లేషించుకొని, దాని పనితీరును మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడేలా 'పోర్ట్‌ఫోలియో ఆప్టిమైజర్'ను కూడా ప్రారంభించింది. ఫోన్‌పే ఇన్వెస్ట్ వేదిక ద్వారా షేర్లు, ఐపీఓలు, మ్యూచువల్ ఫండ్లు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ)లో పెట్టుబడులు పెట్టవచ్చు. అంతేకాకుండా వివిధ డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న పెట్టుబడులన్నింటినీ ఒకేచోట పరిశీలించే సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ వేదికలోని పోర్ట్‌ఫోలియో ఆప్టిమైజర్ పెట్టుబడుల పనితీరును విశ్లేషించి, సరిగా రాణించని పెట్టుబడులను గుర్తించడంలో సహాయపడుతుంది. అలాగే ఏయే రంగాల్లో అధికంగా పెట్టుబడులు పెట్టారో తెలియజేస్తూ తగిన సూచనలు అందిస్తుంది.
వివరాలు
అవసరమైన మార్పులు చేసుకొనే అవకాశం
ఈ విశ్లేషణ ఆధారంగా పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో అవసరమైన మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది.
పెట్టుబడులకు సంబంధించిన వివిధ సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా మరింత మందికి పెట్టుబడి అవకాశాలను చేరువ చేయడమే తమ లక్ష్యమని ఫోన్‌పే వ్యవస్థాపకుడు, చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ రాహుల్ చారి తెలిపారు.
పెట్టుబడుల నిర్వహణను మరింత సులభతరం చేయడంలో ఈ కొత్త సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఇప్పటికే షేర్.మార్కెట్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారుల డీమ్యాట్ పెట్టుబడుల్లోగానీ, లాగిన్ వివరాల్లోగానీ ఎలాంటి మార్పులు ఉండవని రాహుల్ చారి స్పష్టం చేశారు.
అంటే, ప్రస్తుత వినియోగదారులు తమ పెట్టుబడులు, లాగిన్ వివరాల విషయంలో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.