PPF Loan: పీపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే లోన్ సౌకర్యం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడిదారులకు సురక్షితమైన ఎంపికగా నిలుస్తోంది. ఇందులో పెట్టుబడి పెడితే వచ్చే వడ్డీ, ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. అదేవిధంగా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. రిస్క్ లేకుండా పొదుపు చేయాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.
వివరాలు
పీపీఎఫ్‌లో రుణం ఎలా పొందాలి?
పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టినవారు అవసరమైనప్పుడు రుణం కూడా పొందవచ్చు. అకౌంట్ ప్రారంభించిన మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య కాలంలో, పీపీఎఫ్ బ్యాలెన్స్‌పై తక్కువ వడ్డీతో లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఫారం-డీని పూర్తి చేసి, మీరు అకౌంట్ తెరిచిన బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌లో దరఖాస్తు చేయాలి. పీపీఎఫ్ ఖాతా నెంబర్, అవసరమైన రుణ మొత్తం, పాస్‌బుక్ కాపీ, డిక్లరేషన్ వంటి వివరాలు సమర్పించాలి. పరిశీలన అనంతరం రుణం మంజూరు అవుతుంది. ఈ రుణాన్ని 36 నెలల్లోపు తిరిగి చెల్లించాలి.
వివరాలు
ఎంత వరకు రుణం పొందవచ్చు?
రుణం కోసం దరఖాస్తు చేసే సంవత్సరానికి ముందు రెండో సంవత్సరాంతంలో ఖాతాలో ఉన్న నిల్వలో గరిష్టంగా 25 శాతం వరకు రుణం పొందవచ్చు. అలాగే, మొదటి రుణాన్ని 36 నెలల్లోపు చెల్లిస్తే, ఆరు సంవత్సరాల లోపు మరోసారి రుణం పొందే అవకాశం కూడా ఉంటుంది.
వివరాలు
వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?
36 నెలల్లోపు రుణాన్ని చెల్లిస్తే, వడ్డీ రేటు సంవత్సరానికి కేవలం 1 శాతం మాత్రమే ఉంటుంది. కానీ 36 నెలల తర్వాత చెల్లిస్తే, రుణం మంజూరైన తేదీ నుంచి సంవత్సరానికి 6 శాతం వడ్డీ విధిస్తారు. రుణాన్ని తిరిగి చెల్లించే కాలంలో మీ పీపీఎఫ్ పొదుపుపై వడ్డీ లభించదు. వడ్డీ మొత్తాన్ని రెండు లేదా అంతకంటే తక్కువ నెలవారీ వాయిదాల్లో (EMI) చెల్లించవచ్చు. వడ్డీ చెల్లింపులో విఫలమైతే, మిగిలిన మొత్తం పీపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ నుంచి కోత వేయబడుతుంది. మొత్తానికి, పీపీఎఫ్‌లో పెట్టుబడి పెడితే పొదుపు, పన్ను మినహాయింపులతో పాటు అత్యవసర సమయంలో తక్కువ వడ్డీతో రుణం పొందే సౌకర్యం కూడా లభిస్తుంది. ఇది పెట్టుబడిదారులకు అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.