Union Budget 2026 : పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్?.. 2026 బడ్జెట్‌లో టాప్ 13 పన్ను అంచనాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్ ఇచ్చే సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. బడ్జెట్ 2025 తర్వాత తొమ్మిదవసారి కేంద్ర బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది వ్యక్తిగత ఆదాయపు పన్ను, జీఎస్‌టీ రేట్లలో కొన్ని మార్పులతో ఆర్థిక ఊరట కల్పించిన ప్రభుత్వం.. ఈసారి పెద్ద ఎత్తున పన్ను రేట్ల కోతలు ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Details
మధ్య తరగతి వారికి ఊరట
అయితే, పన్ను రేట్లు తగ్గించకపోయినా పన్ను నిబంధనలను సులభతరం చేయడం, మధ్యతరగతి వారికి ఊరటనిచ్చే మార్పులు తీసుకురావచ్చని మరో వర్గం నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ 2026ను దృష్టిలో పెట్టుకొని పరిశ్రమ సంస్థలు, పన్ను నిపుణులు పలు కీలక మార్పులను ప్రభుత్వం ముందుకు తేవాలని కోరుతున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను, మినహాయింపులు, డిడక్షన్లు, ఇతర నిబంధనల్లో సరళీకరణ జరిగితే మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గడంతో పాటు పొదుపులు, ఖర్చులకు ఊతం లభిస్తుందని అంచనా. ఈ క్రమంలో బడ్జెట్ 2026లో పన్ను చెల్లింపుదారులు ఆశిస్తున్న టాప్ 13 కీలక మార్పులు ఇవే
Details
1. హెచ్ఆర్ఏ మినహాయింపుల సవరణ
ప్రస్తుతం మెట్రో నగరాల్లో జీతంలో 50 శాతం, నాన్-మెట్రో నగరాల్లో 40 శాతం వరకు మాత్రమే హెచ్ఆర్ఏ మినహాయింపు ఉంది. అయితే వాస్తవ అద్దెలు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితులను సవరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టైర్-2 నగరాల్లో అద్దెలు మెట్రో నగరాలకు దగ్గరగా ఉన్నాయని చెబుతున్నారు. 2. ఎన్ఆర్ఐలకు 182 రోజుల రెసిడెన్సీ రూల్ ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల వల్ల ఎన్ఆర్ఐలు అనుకోకుండా రెసిడెంట్‌గా మారే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. విదేశీ ఆదాయంపైనా భారత్‌లో పన్ను పడే అవకాశం ఉండటంతో గందరగోళం నెలకొంటోంది. అందుకే పాత 182 రోజుల రెసిడెన్సీ రూల్‌ను తిరిగి అమలు చేయాలని సూచిస్తున్నారు.
Details
3. స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
కొత్త పన్ను విధానంలో రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్‌ను కనీసం రూ.1 లక్షకు పెంచాలని పన్ను నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. 4. క్యాపిటల్ గెయిన్స్‌పై రిబేట్ రూ.12 లక్షల వరకు ఆదాయానికి సెక్షన్ 87A రిబేట్ వర్తిస్తున్నప్పటికీ.. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్ల క్యాపిటల్ గెయిన్స్‌కు ఇది వర్తించడం లేదు. ఈ రిబేట్‌ను ఈక్విటీ ఆదాయానికి కూడా విస్తరించాలని సూచనలు ఉన్నాయి. 5. కొత్త పన్ను విధానంలో హెల్త్ ఇన్సూరెన్స్ మినహాయింపు ప్రస్తుతం పాత పన్ను విధానంలో మాత్రమే ఉన్న ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపును కొత్త విధానంలో కూడా అందించాలని నిపుణులు కోరుతున్నారు.
Details
6. గృహ రుణ వడ్డీ మినహాయింపు పెంపు
ఇళ్ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గృహ రుణ వడ్డీ మినహాయింపును రూ.5 లక్షలకు పెంచాలని, కొత్త పన్ను విధానంలో కూడా ఈ ప్రయోజనం ఇవ్వాలని సూచిస్తున్నారు. 7. అద్దె ఆదాయంపై పన్ను లెక్కింపు వాస్తవ అద్దె ఆదాయంపైనే పన్ను విధించాలని, దీనికి బదులుగా 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్, మునిసిపల్ పన్నులు, వడ్డీ ఖర్చులకు పూర్తి మినహాయింపు ఇవ్వాలని సూచిస్తున్నారు. 8. టీడీఎస్ రేట్ల సరళీకరణ ప్రస్తుతం ఉన్న ఆరు టీడీఎస్ రేట్లను రెండు రేట్లకు (1 శాతం లేదా 5 శాతం) పరిమితం చేయాలని ఐసీఏఐ సూచించింది.
Details
9. రియల్‌టైమ్ టాక్స్ రీఫండ్ ట్రాకింగ్
పన్ను రీఫండ్ ఆలస్యంతో గతంలో ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో రియల్‌టైమ్ రీఫండ్ ట్రాకింగ్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రవేశపెట్టాలని, ఆలస్యమైన రీఫండ్‌లపై వడ్డీ చెల్లించాలని సూచిస్తున్నారు. 10. సర్‌చార్జ్ థ్రెషోల్డ్ పెంపు కొత్త పన్ను విధానంలో సర్‌చార్జ్ కోసం ఆదాయ పరిమితిని రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 11. బంగారం, వెండిపై హోల్డింగ్ పీరియడ్ తగ్గింపు ఫిజికల్ గోల్డ్‌పై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌కు అవసరమైన హోల్డింగ్ కాలాన్ని ఒక ఏడాదికి తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Details
12. భార్యాభర్తలకు జాయింట్ టాక్స్ ఆప్షన్
భార్యాభర్తలకు ఉమ్మడి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాలని ఐసీఏఐ ప్రతిపాదించింది. ఈ విధానం అమెరికా, యూకేలో ఇప్పటికే అమల్లో ఉంది. 13. ఎన్‌పీఎస్ నిబంధనల్లో స్పష్టత ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్‌పై డబుల్ టాక్సేషన్‌కు దారితీసే నిబంధనలకు ముగింపు పలకాలని నిపుణులు కోరుతున్నారు. బడ్జెట్ 2026లో ఈ మార్పులు అమలైతే.. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు గణనీయమైన ఊరట లభిస్తుందని ఆర్థిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.