
GST reforms: మధ్య తరగతి వారికి శుభవార్త.. జీఎస్టీ సంస్కరణలతో కార్లు, బైకుల ధరలు తగ్గనున్నాయా?
ఈ వార్తాకథనం ఏంటి
జీఎస్టీ సంస్కరణలు త్వరలో అమలుకానున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సంస్కరణలతో ఆటోమొబైల్ పరిశ్రమతో పాటు వినియోగదారులకు కూడా పెద్ద మేలు జరగనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Details
జీఎస్టీ స్లాబుల సరళీకరణ ప్రణాళిక
ప్రస్తుతం వస్తువులు, సేవలపై 5%, 12%, 18%, 28% చొప్పున పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వీటిని కేవలం రెండు విభాగాలుగా మార్చాలని నిర్ణయించింది. అవి స్టాండర్డ్ రేట్ (18%), మెరిట్ రేట్ (5%). ఈ మార్పుల వల్ల ప్రస్తుతం 28% జీఎస్టీ స్లాబ్‌లో ఉన్న కార్లు, ద్విచక్ర వాహనాలపై పన్ను 18%కి తగ్గుతుంది. ఫలితంగా వాహన ధరలు సుమారు 5-10% వరకు పడిపోవచ్చని అంచనా.
Details
మధ్యతరగతి వాహనదారులకు లాభం
ఈ చర్యల వల్ల రూ. 10 లక్షల లోపు కార్లు, తక్కువ ధరలో లభించే ద్విచక్ర వాహనాలు వినియోగదారులకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా ఆటోమొబైల్ విడిభాగాలపై కూడా పన్ను తగ్గనుంది. దీనివల్ల తయారీదారుల ఖర్చులు తగ్గి, వినియోగదారులకు వాహనాలు మరింత తక్కువ ధరలో లభించే అవకాశం ఉంది. విడిభాగాల పన్ను తగ్గడంతో వాహన సంరక్షణ ఖర్చులు కూడా తగ్గుతాయి.
Details
ఎలక్ట్రిక్ వాహనాలు, లగ్జరీ కార్లు
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న 5% జీఎస్టీ యథాతథంగా కొనసాగనుంది. లగ్జరీ కార్ల పన్ను విధానంలో పెద్దగా మార్పులు లేనప్పటికీ, ప్యాసింజర్ కార్లపై అమలులో ఉన్న కాంపెన్సేషన్ సెస్ కొనసాగుతుంది. కొన్ని లగ్జరీ, సిన్ వస్తువులపై 40% పన్ను విధించే అవకాశం ఉందని కూడా సమాచారం.
Details
ఆర్థిక వ్యవస్థకు ఊతం
ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం 'సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడం. ప్రత్యేకించి ఎంఎస్‌ఎంఈ రంగం వ్యాపార విస్తరణకు ఇది తోడ్పడనుంది. పన్నులు తగ్గడంతో వాహనాలే కాకుండా గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా తక్కువ ధరల్లో లభించే అవకాశముంది. ఫలితంగా ప్రజలకు ఉపశమనం లభించడమే కాకుండా దేశీయ డిమాండ్ పెరిగి మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది.
Details
అమలు వేళ
జీఎస్టీ కౌన్సిల్ ఈ ప్రతిపాదనలను రాబోయే సమావేశంలో చర్చించనుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్త జీఎస్టీ స్లాబులు అమలులోకి రానున్నాయి. దీపావళి సీజన్ నాటికి, అంటే అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ నాటికి ఈ మార్పులు అమలులోకి వచ్చే అవకాశముందని సంకేతాలు ఉన్నాయి. మొత్తంగా, ఈ సంస్కరణలు వినియోగదారులకు తక్కువ ధరలు, పరిశ్రమలకు వ్యాపార వృద్ధి, దేశానికి ఆర్థిక బలాన్ని తీసుకురానున్నాయి.