Vodafone Idea: వొడాఫోన్ ఐడియాకు శుభవార్త.. 6 ఏళ్ల తర్వాత తొలిసారి లాభాలు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
అప్పుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా ఆరేళ్ల తర్వాత తొలిసారిగా లాభాల్లోకి వచ్చింది. 2025-26 మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.51,970 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ప్రధానంగా సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాల(AGR)బకాయిలపై ప్రభుత్వం ఇచ్చిన ఊరట కారణంగానే ఈభారీ లాభం సాధ్యమైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీకి రూ.7,176 కోట్ల నికర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, 2025 డిసెంబర్ 31 నాటికి ఉన్న రూ.80,502 కోట్ల బకాయి సవరించబడడంతో అది రూ.24,880 కోట్లకు తగ్గింది. ఈ సవరణ వల్ల వచ్చిన రూ.55,622 కోట్ల తేడా (తిరిగి మదింపు ప్రభావంతో పాటు ఇతర సంబంధిత కేటాయింపులు) లాభనష్ట ఖాతాలో ప్రతిఫలించినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.
వివరాలు
పూర్తి ఏడాదిలోనూ లాభాలు
అదే సమయంలో కంపెనీ ఆదాయం కూడా స్వల్పంగా పెరిగింది. గత ఏడాది రూ.11,229 కోట్లుగా ఉన్న ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.11,332 కోట్లకు చేరుకుంది. AGR బకాయిల సవరణ ప్రభావంతో వొడాఫోన్ ఐడియా కేవలం మార్చి త్రైమాసికంలోనే కాకుండా 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా లాభాల్లోకి వచ్చింది. ఈ ఏడాదికి కంపెనీ రూ.34,552 కోట్ల వార్షిక లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో కంపెనీకి రూ.27,384 కోట్ల నష్టం నమోదైంది. ఇక వార్షిక ఆదాయం కూడా 3 శాతం పెరిగి రూ.43,454 కోట్ల నుంచి రూ.44,782 కోట్లకు చేరుకుంది.