
Google Layoffs: గ్లోబల్ టెక్ దిగ్గజం 'గూగుల్' ఉద్యోగులకు మరోసారి లేఆఫ్‌లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల తొలగింపులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
ఆర్థిక అనిశ్చితి, అంతర్జాతీయ మార్కెట్లలో ఒత్తిళ్లు, టారిఫ్ యుద్ధాలు, అమెరికాలో మాంద్యం రానుందన్నఆందోళనలు, కంపెనీల లాభాల్లో తగ్గుదల, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరగడం వంటి అనేక అంశాలు కలసి సంస్థలను ఖర్చులు కట్టడికి ప్రేరేపిస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు తమ సిబ్బందిని తగ్గించే దిశగా ముందడుగు వేస్తున్నాయి.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు దాదాపు 100 టెక్ కంపెనీలు కలిపి 27,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి.
ఈ పరిణామాల మధ్యనే తాజాగా గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగుల్లో మరొకసారి తొలగింపులు చేపట్టింది.
వివరాలు
200 మంది ఉద్యోగుల తొలగింపు
తాజాగా గూగుల్ తన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (Global Business Unit) లో పని చేస్తున్న సేల్స్, పార్ట్‌నర్‌షిప్ విభాగాలకు చెందిన సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.
దీనికి సంబంధించిన విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా జాతీయ మీడియా వరుస కథనాలను ప్రచురిస్తోంది.
సంస్థలో కొనసాగుతున్న పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
గమనించదగిన విషయం ఏమిటంటే, నెల రోజుల వ్యవధిలో గూగుల్ రెండవసారి ఉద్యోగుల తొలగింపులను ప్రకటించటం ఇది.
గత నెల 11వ తేదీన గూగుల్ ప్లాట్‌ఫామ్, డివైజ్ యూనిట్లలో పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగించింది.
వివరాలు
గూగుల్ సుమారు 10 శాతం ఉద్యోగులపై లేఆఫ్
ఈ తొలగింపులు ముఖ్యంగా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్‌లను అభివృద్ధి చేసే బృందాలపై ప్రభావం చూపాయి.
అంతేకాక, గత ఏడాది డిసెంబరులో గూగుల్ సుమారు 10 శాతం ఉద్యోగులపై లేఆఫ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అదేసమయంలో 2023 జనవరిలో గూగుల్ ఏకంగా 12,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
ఇటీవలి కాలంలో చిన్నా,పెద్దా తేడా లేకుండా అనేక టెక్ కంపెనీలు వివిధ కారణాలను చూపిస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగిస్తున్నాయి.
వివరాలు
లేఆఫ్స్.ఎఫ్‌వై వెబ్‌సైట్ ఇచ్చిన వివరాలు
లేఆఫ్స్.ఎఫ్‌వై (Layoffs.fyi) అనే వెబ్‌సైట్ ఇచ్చిన వివరాల ప్రకారం, 2025 లో ఇప్పటివరకు 100 టెక్ కంపెనీలు కలిపి 27,762 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి.
గత సంవత్సరం అంటే 2024లో 549 కంపెనీలు 1,52,472 మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి.
2023లో అయితే 1,193 కంపెనీలు కలిపి 2,64,220 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.