Google Pay: భారత్ లో తొలి క్రెడిట్ కార్డును ప్రారంభించిన గూగుల్..
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో డిజిటల్ లావాదేవీలకు యూపీఐ (UPI) కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే విస్తృతంగా ఉపయోగంలో ఉన్న ఈ వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా గూగుల్ పే మరో అడుగు వేసింది. యూపీఐ సౌలభ్యాన్ని క్రెడిట్ కార్డ్‌తో కలిపి వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందించేందుకు 'ఫ్లెక్స్ బై గూగుల్ పే' పేరుతో కొత్త డిజిటల్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. డిసెంబర్ 17, 2025న గూగుల్ పే, ఆక్సిస్ బ్యాంక్, రూపే నెట్‌వర్క్‌తో కలిసి ఈ కార్డును అధికారికంగా ప్రారంభించింది. భారతదేశంలో రోజువారీ ఖర్చుల కోసం యూపీఐ ఆధారిత క్రెడిట్ వినియోగాన్ని సులభతరం చేసే తొలి కో-బ్రాండెడ్ డిజిటల్ క్రెడిట్ కార్డ్ ఇదేనని గూగుల్ పే వెల్లడించింది.
వివరాలు
'ఫ్లెక్స్ బై గూగుల్ పే' పూర్తిగా డిజిటల్ క్రెడిట్ కార్డ్
ఈ బ్రాండ్ కింద తొలి ఉత్పత్తిగా 'గూగుల్ పే ఫ్లెక్స్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్'ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఇది యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో రూపొందించబడింది. పూర్తిగా గూగుల్ పే యాప్‌లోనే అందుబాటులో ఉంటుంది. 'ఫ్లెక్స్ బై గూగుల్ పే' పూర్తిగా డిజిటల్ క్రెడిట్ కార్డ్ కావడం విశేషం. ఇది రూపే నెట్‌వర్క్‌పై పనిచేస్తూ, యూపీఐ పేమెంట్ల మాదిరిగానే సులభంగా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తుంది. అయితే, ఇది నేరుగా బ్యాంక్ బ్యాలెన్స్ కాకుండా క్రెడిట్ లైన్ ద్వారా లావాదేవీలు జరిపే సౌలభ్యాన్ని ఇస్తుంది. ప్రస్తుతం దేశంలో కేవలం సుమారు 5 కోట్ల మందికే క్రెడిట్ కార్డులు ఉండగా, ఈ పరిస్థితిని మార్చాలనే లక్ష్యంతో ఫ్లెక్స్‌ను తీసుకువచ్చినట్లు గూగుల్ పే పేర్కొంది.
వివరాలు
ఫిజికల్ పేపర్‌వర్క్ అవసరం లేదు
ఈ డిజిటల్ క్రెడిట్ కార్డుకు అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ పే యాప్‌లోనే కొన్ని నిమిషాల్లో అప్లై చేసి కార్డును పొందవచ్చు. ఎలాంటి ఫిజికల్ పేపర్‌వర్క్ అవసరం లేదు. ఆఫ్‌లైన్ దుకాణాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు. అలాగే ఆన్‌లైన్ యాప్‌లు, వెబ్‌సైట్లలోనూ ఈ కార్డును ఉపయోగించుకోవచ్చు.దేశవ్యాప్తంగా లక్షలాది, కోట్లాది మర్చంట్‌లు ఈ సేవను సపోర్ట్ చేస్తారు. ప్రతి లావాదేవీపై వినియోగదారులకు తక్షణ రివార్డ్స్ అందుతాయి. 'స్టార్స్' రూపంలో రివార్డ్స్ లభిస్తాయి. ఒక్కో స్టార్ విలువ రూ. 1గా నిర్ణయించారు. ఈ రివార్డ్స్‌ను వెంటనే రిడీమ్ చేసుకునే అవకాశం ఉండటం మరో ప్రత్యేకత. నెలాఖరు వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు.
వివరాలు
క్రెడిట్ కార్డ్ పూర్తిగా వర్చువల్
అలాగే బిల్లును గూగుల్ పే యాప్‌లోనే ట్రాక్ చేయవచ్చు. మొత్తం బిల్లును ఒకేసారి చెల్లించే అవకాశం ఉండటంతో పాటు, అవసరమైతే EMIగా మార్చుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించారు. భద్రత పరంగా కూడా ఈ కార్డులో పలు నియంత్రణలు ఉన్నాయి. వినియోగదారులు అవసరమైతే కార్డును బ్లాక్ లేదా అన్‌బ్లాక్ చేయవచ్చు. పిన్ రీసెట్ చేసుకునే సౌలభ్యాన్ని కూడా గూగుల్ పే అందిస్తోంది. ఈ క్రెడిట్ కార్డ్ పూర్తిగా వర్చువల్ మాత్రమే. ఫిజికల్ కార్డ్ ఇవ్వరు. చిన్న ఖర్చుల నుంచి పెద్ద ఖర్చుల వరకు రోజువారీ అవసరాల కోసం దీనిని సులభంగా వినియోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
వివరాలు
ఫ్లెక్స్ క్రెడిట్ వినియోగాన్ని చాలా సరళంగా మార్చేలా డిజైన్
టెక్ దిగ్గజం గూగుల్ ప్రకారం, ఫ్లెక్స్ క్రెడిట్ వినియోగాన్ని చాలా సరళంగా మార్చేలా డిజైన్ చేశారు. దరఖాస్తు నుంచి ఆమోదం వరకు మొత్తం ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా జరుగుతుంది. దీనికి కేవలం కొన్ని నిమిషాలే పడుతాయని గూగుల్ వెల్లడించింది. ప్రస్తుతం 'ఫ్లెక్స్ బై గూగుల్ పే' అందుబాటులోకి వచ్చినప్పటికీ, రాబోయే నెలల్లో మరింత ఎక్కువ మంది వినియోగదారులకు ఈ సేవను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటివరకు ఆసక్తి ఉన్నవారు గూగుల్ పే యూపీఐ యాప్‌లోని వెయిట్‌లిస్ట్‌లో చేరవచ్చని తెలిపింది.