Page Loader
SEBI chief: సెబీకి త్వరలో కొత్త చీఫ్‌.. దరఖాస్తులు ఆహ్వానించిన కేంద్రం

SEBI chief: సెబీకి త్వరలో కొత్త చీఫ్‌.. దరఖాస్తులు ఆహ్వానించిన కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
01:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా (SEBI)కి కొత్త చీఫ్‌ నియామకానికి సంబంధించి కేంద్రం తాజాగా ప్రక్రియ ప్రారంభించింది. ప్రస్తుత చీఫ్‌ మాధవి పురీ బచ్‌ (Madhavi Puri Buch) పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 28న ముగియనుంది. ఆమె 2022 మార్చి 2న బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకానమిక్‌ అఫైర్స్‌) అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరింది. ఈ ప్రక్రియ కోసం ఫిబ్రవరి 17ను చివరి తేదీగా నిర్ణయించింది.

వివరాలు 

 సెర్చ్‌ కమిటీ ప్రతిపాదనల ఆధారంగా నియామకం 

పదవీకాలం చేపట్టిన తర్వాత గరిష్ఠంగా ఐదేళ్ల కాలం లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చిన వరకు మాత్రమే ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంటుందని కేంద్రం ప్రకటించింది. సెబీ చీఫ్‌ పదవికి ఎంపికైన వారికి ప్రభుత్వ కార్యదర్శి స్థాయిలో వేతనం చెల్లించబడుతుంది, ఇది నెలకు రూ.5.62 లక్షలు(ఇల్లు,కారు వంటి సౌకర్యాలు తప్పించి)ఉంటుంది. ఈ పదవికి ఎంపికవ్వడానికి కనీసం 25 ఏళ్ల సెక్యూరిటీ మార్కెట్‌ అనుభవం,కనీస వయస్సు 50 సంవత్సరాలు అవసరమని కేంద్రం తెలిపింది. అభ్యర్థి సెక్యూరిటీ మార్కెట్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించగల సామర్థ్యంతో పాటు న్యాయ,ఆర్థిక, అకౌంటెన్సీ రంగాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలని సూచించింది. ఫైనాన్షియల్‌ సెక్టార్‌ రెగ్యులేటరీ అపాయింట్‌మెంట్స్‌ సెర్చ్‌ కమిటీ ప్రతిపాదనల ఆధారంగా ఈ నియామకం జరుగుతుందని కేంద్రం పేర్కొంది.